నిన్నమొన్నటివరకు కేసీఆర్ కాస్త రిలాక్స్డ్ గా కనిపించేవారు. పాలనను కుమారుడు కేటీఆర్ చూసుకుంటుంటే పార్టీ వ్యవహారాలను, మంతనాలు మేనల్లుడు హరీష్ రావు చూసుకునేవారు. ఇద్దరూ ప్రజాక్షేత్రంలో తమను తాము నిరూపించుకున్న నేతలు కావడం, పార్టీలోనూ పట్టు కలిగి ఉండటంతో కేసీఆర్ ఏ కంగారూ లేకుండా పార్టీని వారి చేతికే వదిలేసి ప్రశాంతంగా ఉండేవారు. ఎక్కువ సమయం ఫామ్ హౌస్లోనే గడుపుతూ ఉండేవారు. కానీ కొన్ని నెలల వ్యవధిలో అంతా మారిపోయింది. వరుసగా దుబ్బాక ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడంతో వాటిని హరీష్ రావు, కేటీఆర్ చేతికి అప్పగించారు. ముందుగా దుబ్బాక ఎన్నికలను హరీష్ భుజానికెత్తుకున్నారు.
కేసీఆర్ సైతం హరీష్ మీద నమ్మకముంచి జరిగే వ్యవహారాలను చూస్తూ ఊరుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ ఎన్నికలో బీజేపీ గెలవడంతో కేసీఆర్ షాక్ తిన్నారు. ఆ షాక్ నుండి తేరుకోకముందే గ్రేటర్ ఎన్నికల రూపంలో ఇంకో షాక్ తగిలింది. ఈసారి కేటీఅర్ నిరాశపరిచారు. మెజారిటీ అయితే దక్కించుకున్నారు కానీ బీజేపీని మాత్రం నిలువరించలేకపోయారు. ఈ ఎన్నికల్లో తెరాస సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీ ఎన్నడూ లేని విధంగా రెండవ రెండు పార్టీలకు పెద్దగా తేడా లేదన్నట్టు సీట్లు రావడం కేసీఆర్ ను మరింత కలవరపరిచింది. దీంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పార్టీ తీరు మీద, జనంలో ఉన్న అభిప్రాయం మీద ఒక లుక్ వేశారు.
ఈలోపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇది కూడ తెరాస సిట్టింగ్ స్థానమే. ఈసారి వారికి వీరికి కాకుండా నేరుగా కేసీఆర్ ఏరంగంలోకి దిగారు. అవతల కాంగ్రెస్ నుండి జానారెడ్డి లాంటి సీనియర్ లీడర్ బరిలో ఉన్నారు. గెలవడం అంత ఈజీ కాదు. అందుకే ఆయనే అన్నీ పర్యవేక్షించుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన త్వరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గెలిస్తే ఇంకా ఎన్నో చేస్తామనే సంకేతాలిచ్చారు. లోకల్ శ్రేణుల్ని పూర్తిగా యాక్టివ్ చేశారు. తాను రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని, బీజేపీ ఒక పాసింగ్ క్లౌడ్ అని నిరోపించాలనేది గులాబీ బాస్ ప్రయత్నం. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలమవుతారో చూడాలి.