జల జగడం ముదిరింది. ఇరు రాష్ట్రాల నడుమ చిగురించిన స్నేహం చిగురు దశలోనే రాలిపోయేలా ఉంది. సీఎం వైఎస్ జగన్.. ఏముందిలే మన కేసీఆరే కదా ఒప్పుకుంటారులే అనుకున్నారో లేకపోతే ఏమైనా చూసుకుందామని అనుకున్నారో తెలీదుకానీ కేసీఆర్ నోటీసుకు వెళ్లకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయమై మొదట్లో నెమ్మదిగానే స్పందించిన కేసీఆర్ జగన్ పాలనాపరమైన అనుమతులు, టెండర్లకు పిలుపు అంటూ ఒక్కో అడుగు ముందుకు వేసే కొద్ది కోపోద్రిక్తుడయ్యారు. చివరికి రాయలసీమకు శ్రీశైలం నుండి తమ నీళ్లు ఎలా వెళ్తాయో చూస్తాం అనే స్థాయికి చేరింది రగడ.
ఏపీ, తెలంగాణ.. ఇలా ఎవరూ తగ్గకపోవడంతో విషయం ఎన్జీటీ వద్దకు వెళ్లింది. ఇరు పక్షాల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ అనుమతులపై పునర్విచారణకు అంగీకరించింది. ప్రాజెక్టు కట్టడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదు అంటూ సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు ఉన్నాయని, అనుమతులపై తిరిగి విచారణ జరపాలని టీ సర్కార్ కోరింది. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ సభ్యులు రామకృష్ణన్, సబల్ గుప్తాల ధర్మాసనం విచారణకు ఆదేశించింది. దీంతో ఏపీ సర్కార్ ఇప్పటివరకు చేసిన వాదనలు నీరుగారిపోయినట్టైంది.
దీంతో ప్రభుత్వం తరపు లాయర్ ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని, పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం ఒక్కటై అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. కానీ ఎన్జీటీ ధర్మాసనం మాత్రం తెలంగాణ తరపు వాదనలు వింటామని, వారికీ అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈమేరకు ఈ నెల 28న తుది వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే చాలావరకు ధర్మాసనం, రివర్ బోర్డుల ముందు బలమైన వాదనలు, అభ్యంతరాలు వినిపించిన తెలంగాణ ప్రభుత్వం కొత్త పిటిషన్ ద్వారా మరింత బలమైన అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంది. ఈ దూకుడు చూస్తే కేసీఆర్ చెప్పినట్టే ఎక్కడైనా స్నేహం కానీ నీళ్ల దగ్గర మాత్రం కాదనే తన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.