తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా.. పార్టీ పేరు కూడ ఫైనల్ చేశారా.. రోడ్ మ్యాప్ రెడీ అయిందా అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. కేసీఆర్ మొదటి నుండి కేంద్ర రాజకీయాల మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. ఉత్తరాది పార్టీలు దక్షిణాది పార్టీల మీద ఆధిపత్యం చేస్తున్నాయని, ప్రాంతీయ పార్టీల పాలనలో ఉండే రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయనే వేదన కేసీఆర్ మనసులో బలంగా ఉంది. దేశాన్ని కాంగ్రెస్ లేదంటే బీజేపీ మాత్రమే పాలించాలా.. వేరొక పార్టీకి స్థానం లేదా.. ఆ రెండు పార్టీల పాలనలో దేశం ఏం బాగుపడింది అంటూ అనేకసార్లు బాహాటంగానే మండిపడ్డారు కేసీఆర్. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. బీజేపీ, కాంగ్రెస్ మిత్ర పక్షాలు తప్ప ఈ ఫెడరల్ ఫ్రంట్ నందు వేరే పార్టీలు ఏవైనా భాగస్వామ్యం కావొచ్చని పిలుపునిచ్చారు.
ఫ్రంట్ ఏర్పాటుకు ఇది వరకే ప్రయత్నాలు చేసిన ఆయన తగినంత సమయం లేకపోవడం, తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అనుకోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర బాధ్యలన్నింటినీ కుమారుడు కేటీఆర్ చేతికి అప్పజెప్పిన ఆయన దాదాపు పూర్తి సమయాన్ని జాతీయ రాజకీయాల మీదే వెచ్చిస్తున్నారు. జాతీయ పార్టీలను ఢీకొట్టాలంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీతో సాధ్యం కాదు. అందుకే జాతీయ పార్టీ నెలకొల్పాలని డిసైడ్ అయ్యారట. ఈ పార్టీకి ‘నయా భారత్’ అనే పేరు నిర్ణయించినట్టు, త్వరలోనే ఈ పేరును ఈసీ వద్ద రిజిస్టర్ చేయించనున్నట్టు తెలుస్తోంది.
నయా భారత్ అనే పేరు కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ అనే పేర్లకు ధీటుగానే ఉంది. ఈ పేరు వింటే మోదీ సైతం ఏదో జరుగుతోందని కలవరపడటం ఖాయం. ప్రస్తుతం పార్టీ విధివిధానాలు, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయడం ఎలా, కాంగ్రెస్, బీజేపీల మీద అనుసరించాల్సిన వ్యూహాలేమిటి, అసలు పార్టీ ఎజెండా ఏ రీతిన ఉండాలి అనే ప్రధాన విషయాల మీద కేసీఆర్ తీవ్రమైన హోమ్ వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే మమతా బెనర్జీ లాంటి ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారట. పైగా బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష తరహా ఎన్నికల విధానాన్ని పాటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉంది. ఒకవేళ ఆ విధానాన్నే తీసుకొస్తే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కేంద్ర రాజకీయాల్లో చులకనైపోతాయి. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రాంతీయ పార్టీల కలయికతో మూడవ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం.