రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అయితే, ఆ విమర్శలు హద్దులు దాటేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లుగా ఆరోపణలు చేసే రాజకీయం ఎక్కువైపోయింది. అసలు రాజకీయం అంటేనే బూతులన్నట్లుగా తయారైంది పరిస్థితి.
అసలు విషయంలోకి వస్తే, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ‘లిక్కర్ స్కామ్’ ఆరోపణలు వస్తోన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై పెను రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సా (వీళ్ళెవరూ తెలంగాణకు చెందినవారు కాదు), ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవితకి లింకులున్నాయని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన ఇంజంక్షన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కవిత పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దన్నది ఆ ఆర్డర్స్ సారాంశం.
సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దన్నది ఆ ఆర్డర్స్‌లో న్యాయస్థానం పేర్కొన్న అంశం. తదుపరి విచారణ సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా పడింది. దాంతో, కవితకి ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి కాస్త ఊరట దక్కినట్లయ్యింది.
అయితే, బీజేపీ తెలంగాణ నేతలూ, కాంగ్రెస్ నేతలూ కవితపై ఇదే స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి.. వాళ్ళపై ఈ తీర్పు ప్రభావం వుంటుందా.? వుండదా.? ఏమోగానీ, ఈ విమర్శలైతే ఇప్పట్లో ఆగేలా లేవ్. కేసీయార్ కుమార్తెనే ఎందుకు లిక్కర్ స్కామ్‌లో టార్గెట్ చేసినట్లు.?