దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎంతలా కష్టపడుతోందో అందరికీ తెలుసు. మొదట ఎన్నికలకు లైట్ తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గెలుపు కోసం వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. మంత్రి హరీష్ రావును నియోజకవర్గానికే పరిమితం చేసి ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారు. జనం సైతం కేసీఆర్ ఇంతలా పనిచేయడం ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఈ కష్టం సార్వత్రిక ఎన్నికల నాటి కష్టమని, ఎంతో బలమైన పోటీదారులు లేనిదే ఈ స్థాయి కష్టం అవసరంలేదని ముక్కున వేలేసుకుంటున్నారు.
సాధారణంగా సిట్టింగ్ స్థానం కోసం అందునా సొంత నేత మరణించిన స్థానంలో సానుభూతి పుష్కలంగా ఉండి కూడ తెరాస విశ్వప్రయత్నాలు చేస్తోందంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. హరీష్ రంగంలోకి దిగాక కూడ ఈ సిట్యుయేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ పట్టించుకోనట్టే ఉంటూ అన్నిటినీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో కేసీఆర్ కూడ గెలువాడం సులభం అనుకునే రంగంలోకి దిగారు. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అడుగడుగునా అసంతృప్తులు, ఆశావహులు కంటబడ్డారు. అది చూశాకే హరీష్ రావు కొత్త కార్యాచరణ రచించుకున్నారు.
ముందుగా అసంతృప్తులని బుజ్జగించి ఆ తర్వాత ఆశావహులకు నచ్చజెప్పి రామలింగారెడ్డి సతీమణి సుజాతను అభ్యర్థిగా ఖాయం చేశారు. ఇక కాంగ్రెస్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తమవైపుకు లాక్కుని అభ్యర్థిగా ప్రకటించడంతో పెద్ద కష్టం మొదలైంది. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి దుబ్బాకలో మంచి పట్టుంది. ఆయన పోటీలోకి దిగడంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగాయి. ఇక హస్తం పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం ప్రచారంలోకి దూకింది. పర్ఫెక్ట్ ప్లానింగ్ పెట్టుకుని క్యాంపైనింగ్ చేస్తున్నారు. వీటి మధ్యన లక్ష మెజారిటీ అంటే తెరాసకు మహాయజ్ఞమే.
అయినా కేసీఆర్ తగ్గట్లేదు. పడాల్సిన కష్టం పడుతూనే, పన్నాల్సిన వ్యూహాలు పన్నుతూనే దుబ్బాకలో విజయం మాదే. గ్రౌండ్ క్లియర్ గా ఉంది. ఉప ఎన్నిక టీఆర్‌ఎ్‌సకు పెద్ద లెక్కే కాదు అన్నారు. ఇంత ధైర్యం ప్రదర్శిస్తున్న ఆయన మంచి మెజారిటీ అన్నారు తప్ప లక్ష మాట ఎత్తలేదు. ప్రచారం చివరి దశలో ఆయన గనుక క్యాంపైనింగ్ చేయడానికి దిగితే ఉపఎన్నిక గెలుపు ఎంత క్లిష్టమో ఆయన చెప్పకనే చెప్పినట్టు. మరి ఆయన ప్రచారానికి దిగుతారో లేదో చూడాలి.