ఫిలిం క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం విదితమే. ఆయన ప్రస్తుతం చెన్నయ్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ కారణంగా ఆయనకు పలు శస్త్ర చికిత్సలూ చేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలుస్తోంది.
కాగా, కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతుండడంతో, వైఎస్ జగన్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆపద సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడటం కొత్త విషయమేమీ కాదు.
అయితే, కత్తి మహేష్‌కి ఎందుకు సాయం చేయాలి.? అన్న చర్చ ఉత్పన్నమవుతోంది. అందుక్కారణం, ఆయన తెలంగాణ వాసి కావడమే. కానీ, ఆయన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తి. పైగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. అందుకే, బహుశా ప్రభుత్వం కూడా కాస్త పెద్ద మనసు చేసుకుందని భావించాలేమో.
అయితే, ప్రాణాపాయంలో వున్న వ్యక్తికి సాయం చేసే క్రమంలో బాధితుడు ఎక్కడివాడు.? అతను అంతకు ముందు ఎలాంటి వ్యక్తిత్వంతో వున్నాడు.? వంటి విషయాలపై చర్చ అనవసరం. అయినాగానీ, కత్తి మహేష్ విషయంలో చాలా విమర్శలొస్తున్నాయి. అందుక్కారణం, హిందూ మతంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే.
శ్రీరాముడి మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. ఈ నేపథ్యంలోనే ఆయనపై హైద్రాబాద్‌లో నగర బహిష్కరణ వేటు కూడా పడింది. గతం గతః ఇప్పుడాయన తీవ్రగాయాల పాలై ప్రాణాపాయంలో వున్నాడు గనుక, ఆయనకి ప్రభుత్వం అందించిన సాయం కారణంగా కోలుకోవాలనే ఎవరైనా కోరుకోవాలి.