బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’

హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌- బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకువెళుతోంది. రోజురోజుకు బాక్సాఫీస్ వసూళ్లు ఊహించనంతగా పెరుగుతున్నాయి. ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరేట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి..మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా మరి కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాల్లో చాలా వరకు ఆశించినంతగా ఆదరణ పొందలేకపోయాడు. అయితే.. 2013లో వచ్చిన ‘స్వామి రారా’తో నిఖిల్ కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిఖిల్ తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలోవచ్చిన ‘కార్తికేయ 2’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదలైంది. నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఎప్పటి నుంచో మిస్టరీగా మిగిలిపోయిన ద్వారకా నగరం గురించిన కథతో ఈ సినిమా రూపొందింది. ‘కార్తికేయ’ మాదిరిగానే దీన్ని కూడా డివోషనల్ టచ్‌తో రూపొందించారు. నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీకి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ‘కార్తికేయ 2’ మూవీ ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ చందూ మొండేటి ఎంతో సమయం తీసుకోలేదు.

ఇంటర్వెల్ ట్విస్టుతో ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తాడు. ఇక, సెకెండాఫ్ మాత్రం అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో సాగింది.. అలాగే, క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా డిజైన్ చేశారు. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘కార్తికేయ 2’ను చూసిన వాళ్లంతా నిఖిల్ నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అలాగే, సినిమాటోగ్రఫి, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కార్తికేయ 2’ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన థ్రిల్లర్ మూవీ. ఇందులో ద్వారాక నగరాన్వేషన అనే దాన్ని చక్కగా చూపించారు. మరీ ముఖ్యంగా ఆసక్తికరమైన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మొత్తంగా ఇది అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకున్న థ్రిల్లర్ మూవీ.