సినీ నటి కంగనా రనౌత్ అతి త్వరలో రాజకీయాల్లోకి రాబోతోందట. ఈ విషయమై ఆమె తన సన్నిహితులతో మంతనాలు జరుపుతోందట. ఇటీవల ట్విట్టర్ ఆమె ‘హ్యాండిల్’ని సస్పెండ్ చేసిన విషయం విదితమే. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో రాజకీయ ప్రత్యర్థులపై, సినీ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కంగనా రనౌత్ ఓ అలవాటుగా పెట్టుకుంది. తాప్సీ లాంటి హీరోయిన్లను ఉద్దేశించి బి-గ్రేడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తుంటుంది కంగనా రనౌత్. ఇదొక మానసిక రుగ్మత.. అంటారు కొందరు. కంగనా రనౌత్ మాత్రం, తాను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానని చెబుతోంది. ఇటీవల బెంగాల్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. ఆ వెంటనే ఆమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయ్యింది.
గతంలో కూడా పలు మార్లు ఆయా సోషల్ మీడియా వేదికలు, ఆమెకు షాకిచ్చాయి. అసలు సోషల్ మీడియా అంటేనే తనకు నచ్చదని గతంలో చెప్పుకున్న కంగన, ఇప్పుడు సోషల్ మీడియా విషయమై తెగ ఆత్రం ప్రదర్శిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే, కంగనా రనౌత్ ప్రస్తుతానికి రాజకీయాల్లో లేకపోయినా, ఆమె రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తోంది. ఆ పనేదో ప్రత్యక్షంగానే చేస్తే బావుంటుందన్న అభిప్రాయం ఆమె సన్నిహితుల నుంచి వ్యక్తమవుతోందట. జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో కంగన, కీలకమైన నిర్ణయం అతి కొద్దిరోజుల్లోనే తీసుకోబోతోందనీ, ఆమె బీజేపీలో చేరితే మంచి పదవి ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధంగా వుందనీ అంటున్నారు. కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్.. ఆమె చేసే పొలిటికల్ కామెంట్స్, రాజకీయ వర్గాల్లో కాకరేపుతాయి.. అవి బీజేపీకి ప్లస్సవుతాయని కమలనాథులు భావిస్తున్నారట.