మూవీ షూటింగ్స్ కి , ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన కమల్ ..కారణం ఇదే !

సినీ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు ఆయనే నాయకుడు.తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ కూడా చేసింది.

కానీ ఎక్కడా కనీసం ప్రభావం చూపించలేక చతికిలబడింది. తాజాగా భారత ఎన్నికల సంఘం కమల్ హాసన్‌కు ‘టార్చ్‌లైట్’ గుర్తును కేటాయించింది. ఈ యేడాది ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేసేందుకు మనకు కామన్ గుర్తు టార్చ్ లైట్ కేటాయించారు. అన్ని సెగ్మెంట్లలోనూ ఒకే గుర్తు మీద పోటీ చేయవచ్చు. కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తు మీద పోటీ చేసింది. 3.77 శాతం ఓట్ల శాతం సాధించింది.

ఆ సంగతి పక్కనపెడితే.. నిన్నటితో బిగ్‌బాస్ సీజన్ 4 కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ… తాను కొన్ని రోజులు పాటు సినిమాలకు, రాజకీయాలకు బ్రేక్ తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు. శభాష్ నాయుడు షూటింగ్ సందర్భంగా కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. అప్పట్లో కమల్ కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా.. కమల్ హాసన్.. సినిమాలు, రాజకీయాల్లో బిజీ కారణంగా డాక్టర్ల సలహాను పట్టించుకోకుండా రెస్ట్ తీసుకోలేదు.

దీంతో నొప్పి తిరగబడింది. మరోసారి కాలుకు స్వల్ప చికిత్స చేయాలని డాక్టర్లు సూచించారట. దీంతో కమల్ హాసన్ తన షెడ్యూల్స్‌ అన్నింటిని పక్కన పెట్టి డాక్టర్ల సలహా మేరకు శస్త్ర చికిత్స చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోని తమిళనాడు ఎన్నికల లోపు కోలుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు