గుర్తు ప‌ట్ట‌కుండా మారిన నంద‌మూరి హీరో.. ఈ మార్పుకు కార‌ణ‌మేంట‌ని అభిమానులు ఆరా

నంద‌మూరి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వ‌చ్చాడు. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను స‌త్తా చాటాడు. ఎక్కడా తాత, తండ్రి, బాబాయి, సోదరుల పేర్లు వాడ‌కుండా త‌న కంటూ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక‌వైపు హీరోగా మంచి క‌థ‌ల‌ని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా త‌న బేన‌ర్‌లో హిట్ సినిమాలు రూపొందిస్తున్నాడు. తన తోటి సోదరుడు తారకరత్న హీరోగా వచ్చి ఫేడౌట్ అయిన మాస్ హీరోగా నందమూరి అభిమానుల్ని అలరిస్తున్నాడు కళ్యాణ్ రామ్. తెలుగు సినీ ప్రేక్షక లోకంలో తనకంటూ ప్ర‌త్యేక‌మైన అభిమాన గ‌ణాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు.

తెలుగులో తొలిసారి 3డీ యాక్ష‌న్ మూవీగా ఓం అనే సినిమా తీసి తానేంటో నిరూపించాడు క‌ళ్యాణ్ రామ్. స్టార్ హీరోల‌తోనే కాకుండా కుర్ర హీరోల‌తోను మంచి సినిమాలు చేస్తున్నాడు క‌ళ్యాణ్‌. చివ‌రిగా ఎంత మంచివాడ‌వురా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం రావ‌ణ అనే చిత్రాన్ని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వశిష్ట అనే డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నాడు

రావ‌ణ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా క‌ళ్యాణ్ రామ్ లుక్‌కి సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో క‌ళ్యాణ్ రామ్ భారీ జ‌ట్టు, గెడ్డంతో డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని అంటున్నారు. మ‌రోవైపు కల్యాణ్‌రామ్‌, చినబాబుతో కలిసి ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు.