సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు ఖర్చు పెట్టడం కామన్. అది ఏ పార్టీ అయినా ఓటర్లను కొనడమో.. ఇంకేదో చేయడమో చేసి ఎన్నికల్లో గెలవడానికి చూస్తుంది. కానీ.. త్వరలో జరగబోయే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక మాత్రం చాలా కాస్ట్ లీ గురూ. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గెలుపు కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డబ్బుల వర్షం కురుస్తోందట.
నిజానికి ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ ఓటు వేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత కళ్లు మూసుకొని గెలుస్తుంది. అయినప్పటికీ… ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరే పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి లాగుతున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. నూటికి నూరు శాతం ఓట్లు కవితకే రావాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. నిజామాబాద్ లో కనీవినీ ఎరుగని రీతిలో డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసి… వేరే పార్టీల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లోకి లాగుతున్నారని సమాచారం.
అయితే.. ఇప్పటికే నిజామాబాద్ నుంచి ఎంపీగా ఫోటి చేసి కవిత ఓడిపోయారు. పసుపు బోర్డు విషయంలోనూ కవితపై అక్కడ కాస్త వ్యతిరేకత ఉన్నా… అక్కడి ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. ఇక.. అప్పటి నుంచి మళ్లీ వచ్చిన ఒకేఒక చాన్స్ ఇదే. అందుకే… టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బంపర్ మెజారిటీతో కవితను ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలిపించి.. మంత్రి వర్గంలో తీసుకోవాలనేదే సీఎం కేసీఆర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే.. ఈ ఎన్నికలు చాలా కాస్ట్ లీ గా మారాయని చెబుతున్నారు.