AP: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మాజీ వైకాపా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మా పార్టీనే అని ఈయన తెలిపారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మా పార్టీ కార్యకర్తలను వేధించి చిత్రహింసలకు గురిచేశారో వారందరికీ కూడా గుడ్డలూడదీసే నిలబెడతామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసులను ఉద్దేశించి చేయడంతో సంచలనంగా మారాయి. బోగోలు మండలం కోళ్ళదిన్నెలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గాయాలపాలైన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా కార్యకర్తలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
ఇలా బాధితులను పరామర్శించిన అనంతరం ఈయన ఆసుపత్రి ఆవరణంలోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనని అప్పుడు మా కార్యకర్తలను వేధించిన టిడిపి నేతలను కార్యకర్తలను అలాగే పోలీసులను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని తెలిపారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీసులు సప్త సముద్రాలు అవతల ఉన్నా లాక్కొచ్చి గుడ్డలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రేపటి రోజున మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఈయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
