న్యాయమూర్తులపై దాడులు: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీరియస్.!

ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో ఓ హత్య జరిగింది. రోడ్డు ప్రమాదం తరహాలో దుండగులు ఓ న్యాయమూర్తిని హత్య చేశారు. ఓ కేసులో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందన్న కోణంలో దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. న్యాయమూర్తి రోడ్డు మీద వెళుతుండగా, ఆటోతో ఢీకొట్టారు నిందితులు. అది చూడ్డానికి ప్రమాదంగా కనిపిస్తున్నా, దాని వెనుక కుంట్ర కోణం అందరికీ అర్థమయ్యింది. ఈ ఘటనపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. న్యాయ వ్యవస్థపై దాడులు జరుగుతోంటే, సీబీఐ అలాగే ఐబీ లాంటి సంస్థలు తగిన రీతిలో స్పందించడంలేదనీ, ఫిర్యాదు చేసినా స్పందించడంలేదనీ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంతటా విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి, జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం వుంది.

తెలుగు నాట, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయమూర్తులకు రాజకీయాలు ఆపాదించడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంపై అధికార పార్టీకి చెందిన నేతలు, మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా జడ్జిలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా రోగులున్న వార్డుల్లోకి జడ్జిలను నెట్టివేయాలి..’ అని కొందరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించింది. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది ఈ వ్యవహారంపై. పలువురి అరెస్టులు కూడా జరిగాయి. అయితే, జరగాల్సిన రీతిలో విచారణ వేగవంతం కాకపోవడం పట్ల న్యాయ వర్గాల్లో కొంత ఆందోళన వుంది. మొత్తమ్మీ, సీజేఐ.. జార్ఖండ్ వ్యవహారానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, దేశంలో పలు రాష్ట్రాల్లో పరిస్థితుల్ని చెప్పకనే చెప్పినట్లయ్యింది. తెలుగునాట ఇదొక రాజకీయ రగడగా మారిందిప్పుడు.