చట్టాల రూపకల్పనపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

చట్ట సభల్లో చట్టాల రూపకల్పన విషయమై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో చట్టాలు తయారయ్యే సమయంలో సరైన చర్చ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. సరైన చర్చ జరగకుండా అసమగ్రమైన చట్టాల రూపకల్పన జరుగుతుండడంతో లిటిగేషన్లు పెరిగిపోతున్నాయనీ, వాటి కారణంగా న్యాయ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు, దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. నిజమే, చట్ట సభల్లో చట్టాల రూపకల్పన అడ్డగోలుగా జరుగుతోంది. ఇందులో వివాదమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్నే తీసుకుంటే, అందులోని లోటుపాట్ల గురించి వినిపిస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఏడేళ్ళయినా, అందులో చాలా లోపాలున్నాయనే విమర్శ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల నుంచే వినిపిస్తోంది.

కానీ, సవరించాల్సిన ప్రస్తుత పాలకులు ఆ పని చేయకుండా, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కావొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానుల వ్యవహారం కావొచ్చు.. న్యాయస్థానాల్లో ఎందుకు నలుగుతున్నట్టు.? కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట సమయంలో, దానిపై జరగాల్సిన చర్చ కూడా అసమగ్రంగా జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. రాజకీయ గలాటా ఎక్కువైపోయి, నానా రాజకీయ రచ్చా చోటు చేసుకోవడం.. చివరికి తూతూ మంత్రంగా ‘ఆమోదించేసుకోవడం’ పాలకులకు అలవాటైపోయింది. విపక్షాల సంగతి సరే సరి. ఈ తరహా తొందరపాటు చర్యలతో దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతుందన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడే వుండాలి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్ష ముందు వీగిపోవడమంటే, అది ముమ్మాటికీ పాలకుల వైఫల్యమే. ఇందులో కోర్టుల మీద కొందరు విరుచుకుపడటంలో అర్థమే లేదు.