జస్టిస్ ఫర్ చైత్ర: మీడియాకి తీరిగ్గా తెల్లారింది.!

చిన్న విషయానికి పెద్ద కథ అల్లడమెలాగో మన తెలుగు మీడియాకి బాగా తెలుసు. అసలక్కడ పెద్ద విషయం ఏమీ లేకపోయినా, పెద్ద రాద్ధాంతం చేయడంలో మన తెలుగు మీడియాకి సాటి ఇంకెవరూ రారు. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. ఆయన ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది.. రోడ్డు మీద స్కిడ్ అవడంతో కిందపడిపోయాడు సాయి ధరమ్ తేజ్. అతని ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం ఏర్పడింది.. ఆసుపత్రికి తరలించారు.. వైద్య చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన బాగానే వున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి తెలుగు మీడియా ఏకంగా బైక్ డిజైన్ గురించి కూడా విశ్లేషణలు షురూ చేసింది. మరి, చిన్నారి చైత్రపై ఓ మృగాడు అఘాయిత్యం చేస్తే.. ఆ ఘటనకి మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వలేకపోయింది.? ఈ విషయమై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు.

దాంతో, తెలుగు మీడియాకి తీరిగ్గా తెల్లారింది.. జస్టిస్ ఫర్ చైత్ర.. అంటూ చర్చోపచర్చలు షురూ చేసింది. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులతో బిజీగా వుంది. మంత్రి కేటీయార్, ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో తొలుత ప్రకటించేశారు. ఆ తర్వాత తనకు అందిన సమాచారం సరైనది కానందుకు చింతిస్తున్నానంటూ కేటీయార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మీడియా, రాజకీయ పార్టీలూ హడావిడి షురూ చేసేశాయి. మీడియా అయితే, ‘మేం బాధ్యతాయుతంగా వ్యవహరించాం. బాధితురాలి పేరు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు బయటపెట్టకూడదనే సంయమనం పాటించాం..’ అంటూ కవరింగ్ ఇస్తోంది. నిజానికి, ఈ ఘటనలో మృతురాలి పేరు వెల్లడించకపోయినా ఫర్లేదు.. ఆ వీడియోలు చూపించాల్సిన అవసరమూ లేదు.. కుటుంబ సభ్యుల వివరాలూ చెప్పనక్కర్లేదు.. జరిగిన ఘోరం గురించి ప్రపంచానికి తెలియజెప్పాలి కదా.? ఇదీ మన తెలుగు మీడియా తీరు.