నిర్మలమ్మ చీరకట్టు.! మీడియా దిగజారుడుతనానికి పరాకాష్ట.!

మీకు తెలుసా.? బడ్జెట్ వేళ స్వీటు వండుతారట.! అసలు, నిర్మలమ్మ చీరకట్టు ఎందుకు బడ్జెట్ సమయంలో ప్రత్యేకంగా వుంటుంది.? దేశానికి ఇవా ముఖ్యమైన అంశాలు.? కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్టుతో తమ జీవితాలు ఎలా మారతాయోనని కోట్లాది మంది భారతీయులు ప్రతి ఏడాదీ బడ్జెట్ సమయంలో ఎదురు చూస్తుంటారు. మీడియా అడుగుతుంది కాబట్టి, ఆ ఫైళ్ళు పట్టుకుని పోజులివ్వడం ఆర్థిక మంత్రులుగా వున్నవారికి తప్పడంలేదు.

నిర్మలమ్మ చీరకట్టు గురించి ఇప్పుడు పంచాయితీ నడుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ, నిర్మలమ్మ చీరకట్టు ఎందుకు ప్రత్యేకంగా వుంటుందో తెలుసా.? అంటూ తెలుగు నాట ఓ ప్రముఖ మీడియా సంస్థ ఓ చెత్త కథనాన్ని ప్రచురించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తాను ప్రవేశ పెట్టబోయే బడ్జెట్టులో అగ్గి పెట్టె మీద ఎలాంటి పన్ను వేయబోతున్నారు.? చెత్త మీద ఎలాంటి పన్నుల భారం మోపబోతున్నారు.? ఇవి కదా కీలకమైన అంశాలు. దేశాన్ని ముందుకు నడిపేందుకు బడ్జెట్‌లో ఎలాంటి అంశాల్ని ప్రస్తావిస్తారన్నది కదా కావాల్సింది.?

దిగజారుడుతనంలో తెలుగు మీడియా ఎప్పుడూ కొత్త లోతుల్ని వెతుకుతూనే వుంటుంది. ఇంకా నయ్యం.. నిర్మలమ్మ ఎందుకు జుట్టుకి రంగు వెయ్యలేదో తెలుసా.? నరేంద్ర మోడీ గడ్డానికి ఎలాంటి సుగంధాలు పూస్తారో తెలుసా.? లాంటి చర్చలు పెట్టలేదు. ముందు ముందు ఆ దారుణాల్ని కూడా మనం చూడాల్సి రావొచ్చు.