మన తెలుగు మీడియాలోనూ చెప్పు దెబ్బల వ్యవహారం చోటు చేసుకుంది. ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ ఉద్యమ నాయకుడు, ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టాడు. అయితే ఇది ప్రసారం కాకుండా వుండాల్సింది. ఎంత అది లైవ్ ప్రోగ్రామ్ అయినప్పటికీ.. ఖచ్చితంగా నిలువరించేంత సమయం అయితే వుంటుంది. విషయం ముదిరి పాకాన పడేదాకా డిస్కషన్‌ని జర్నలిస్టు కొనసాగించడమే పెద్ద తప్పిదం. అయితే, ఘటన తర్వాత కూడా బాధిత పొలిటికల్ లీడర్, చర్చా కార్యక్రమంలో పాల్గొనగా, దాడి చేసిన వ్యక్తిని మాత్రం ‘బాయ్ కాట్’ చేసేశారు.
అమరావతి సెగ ఆ రాజకీయ నాయకుడికి తగిలిందనేది కొందరి మాట. దీన్ని చాలామంది అదే కోణంలో చూస్తున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతిని స్వాగతించగలమా.? అన్నదే కీలకమైన అంశమిక్కడ. అమరావతి ఉద్యమంలో రైతులు లాఠీలకు ఎదురెళ్ళారు. మహిళలూ చావు దెబ్బలు తిన్నారు. అదంతా నాణానికి ఓ వైపు. మహిళల్ని కొందరు పెయిడ్ ఆర్టిస్టులుగా, కూకట్‌పల్లి ఆంటీలుగా అభివర్ణించారు. ఇదంతా అరాచక రాజకీయమే. రైతులు మంచి బట్టలు వేసుకుంటే చూసి ఓర్చుకోలేనోళ్ళు రాజకీయాల్లో కీలక పదవుల్లో వుండడం శోచనీయమే. అయినాగానీ, అమరావతి పేరుతో దాడులు చేయడాన్ని సమర్థించలేం. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని సమర్థించకూడదు. ఘటనకు వేదిక అయిన సదరు ఛానల్, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండే మీడియా సంస్థ. సదరు ఉద్యమ నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీకి చెందిన సపోర్టర్.. అన్న విమర్శలున్నాయి. ఏదిఏమైనా ఈ విషయాన్ని కాస్తంత సీరియస్‌గానే పరిగణించాలి భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో, అమరావతి ఉద్యమంపై అర్థం పర్థం లేని విమర్శలు చేసే రాజకీయ నాయకులంతా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమరావతికి సంబంధించి రాజకీయంగా విమర్శలు చేయడాన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, ఉద్యమం చేస్తోన్న మహిళలు, రైతులపై అవాకులు చెవాకులు తగవు.