టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేశారుగా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే టీడీపీకి శాపంగా మారాయనే భావన చాలామందిలో ఉంది. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఐదేళ్ల పదవీ కాలంలో నెరవేర్చిన హామీలకు పొంతన లేదు. చంద్రబాబు కొన్ని హామీలను నెరవేర్చారని పత్రికల్లో ప్రచారం జరిగినా నిజ జీవితంలో మాత్రం ఆ హామీలు నెరవేరలేదు.

పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో లోకేశ్ కు అప్పగిస్తే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ జాతకం మారాలంటే ఆ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా రాజకీయాల్లోకి రావాలని గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల రాజకీయాలపై ఆసక్తి లేని విధంగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఒక ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని చెప్పకనే చెప్పేశారు. తనకు తాతగారు స్పూర్తి అని పౌరుడిగా ఎంత బాధ్యతతో వ్యవహరించాలో తాతగారు నేర్పారని తారక్ అన్నారు. ఆయన నుంచి సమాజానికి ఏదైనా చేయాలని నేర్చుకున్నానని అభిమానులకు ప్రేమను పంచడమే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాలతో సంతృప్తితో ఉన్నానని సమయం వస్తే తాతగారి అడుగుజాడల్లో నడుస్తానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. పొలిటికల్ ఎంట్రీ గురించి తారక్ నుంచి క్లారిటీ అయితే వచ్చింది. అయితే తారక్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. టీడీపీ కార్యకర్తలు, నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ పైనే ఆశలు పెట్టుకోవడం గమనార్హం.