జేసీ సోదరులు వైసీపీలోకి ఎంట్రీ సాధించగలరా.?

 

ఒకప్పుడు జేసీ బ్రదర్స్.. అంటే అనంతపురం జిల్లాలో పవర్ సెంటర్. కానీ, ఇప్పుడు సీన్ మారింది. జేసీ బ్రదర్స్ వివాదాలెదుర్కోవడం కొత్త కాదుగానీ, ఈసారి వరుస వివాదాలతో రాజకీయంగా పూర్తిగా దెబ్బతినేశారు. ఓ పోలీస్ అధికారిని రాజకీయంగా సవాల్ చేసి, రాజకీయాల్లోంచి దాదాపుగా తెరమరుగైపోవాల్సి వచ్చింది మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి. జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి సరే సరి. తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ అయ్యారుగానీ.. అలా ఆయన ఆ పదవిలో కూర్చోవడానికి కారణం వైసీపీ. వైసీపీ దయా దాక్షిణ్యాలతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనా అంగీకరించారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జేసీ బ్రదర్స్ చెలరేగిపోయారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత ‘మావాడే..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించినా, వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. ఎలాగోలా వైసీపీలోకి ఎంట్రీ సంపాదించాలని జేసీ దివాకర్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుంది.. గత కొంత కాలంగా ఆయన చర్యలు అవే సంకేతాల్ని ఇస్తున్నాయ్ మరి. అయినాగానీ, వైసీపీ అధిష్టానం జేసీ ప్రభాకర్ రెడ్డిని కరుణించడంలేదు. ఓ అడుగు ముందుకేసి, టీడీపీ మీద ఘాటైన విమర్శలు షురూ చేశారిప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి మాత్రం రాజకీయంగా మౌనం దాల్చేశారు. ఆయనసలు పెదవి విప్పడానికీ ఇష్టపడటంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అదీ అసలు సంగతి.