మెట్రో ప్రయాణంతో అగ్నికి ఆజ్యం పోసిన జనసేనాని

pawan kalyan metro

 నిన్న పవన్ కళ్యాణ్ చేసిన మెట్రో ప్రయాణం తెలంగాణలో రాజకీయ అగ్నికి ఆజ్యం పోసిందా అంటే అవుననే చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉరుము లేని పిడుగులా నిన్న జనసేన అధినేత మొదటి సరి హైదరాబాద్ మెట్రో రైలులో సాధారణ ప్రయాణికుడిగా మాదాపూర్ నుండి మియాపూర్ వరకు ప్రయాణించాడు . వకీల్ సాబ్ షూటింగ్ మియాపూర్ పరిసరాల్లో జరగటంతో అక్కడికి మెట్రో లో పవన్ వెళ్లినట్లు అనేక మంది భావించారు, కానీ పవన్ మెట్రో ప్రయాణం వెనుక పెద్ద ప్రణాళికలే ఉన్నట్లు తెలుస్తుంది.

pawan kalyan metro

 జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ , కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేశాడు , కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాటి నుండి తెలంగాణాలో కూడా జనసేన పార్టీని విస్తరించాలని చూస్తున్నాడు, అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటికే 50 డివిజన్స్ లో పార్టీ కమిటీలను నియమించాడు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేయాలనీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకోవటంతోనే పవన్ మెల్ల మెల్లగా హైదరాబాద్ లో పార్టీ శ్రేణుల సమాయత్తం చేయటం కోసమే తాజాగా మెట్రో ప్రయాణం చేసినట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా జనసేన తన కార్యక్రమాలు విస్తృతం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇక పవన్ మెట్రో ప్రయాణంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ముఖ్యంగా తెరాస నేతలు పవన్ మీద ఒంటికాలి మీద లేస్తున్నారు. ఇన్నేళ్ల నుండి గుర్తురాని హైదరాబాద్ ఎన్నికలకి ముందు గుర్తు రావటం ఆశ్చర్యం, బీజేపీ తో కలిసి ఇక్కడ నాటకాలు వేయాలని చూస్తే ఆంధ్ర ప్రజల మాదిరి చూస్తూ ఊరుకునే జనాలు తెలంగాణ వాళ్ళు కాదని తగిన శాస్తి చేస్తారని హెచ్చరికలు జారీచేస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ మెట్రో ప్రయాణంపై విమర్శలు చేస్తూ, పవన్ ను నమ్మటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని, డ్రామాలేస్తే ఓట్లు పడవంటూ కౌంటర్లు ఇస్తున్నారు, దీనిపై జనసేన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సాధారణ ప్రయాణం చేస్తే మీకెందుకు అంత భయం..? పవన్ కళ్యాణ్ ఒక్క అడుగు బయట పెడితేనే ఇంతగా ఎందుకు వణికిపోతున్నారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికే గ్రేటర్ పోరులో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుకుంటూనే తాజాగా జనసేన కూడా వీళ్ళతో చేరిపోయేలా కనిపిస్తుంది.