మరోసారి విడాకులు తీసుకున్న జనసేనుడు

Janasenu once again divorced

Janasenu once again divorced

ఏమిటో విధిరాత తెలియదు కానీ, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు..రాజకీయ జీవితంలో కూడా “విడాకులు” అవిభాజ్యమైన భాగం అయిపోయాయి! వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. పీతకష్టాలు పీతవి అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఎవరి కష్టనష్టాలు వారివి అని సరిపెట్టుకుందాము. కానీ రాజకీయ జీవితం అనేది పబ్లిక్ కాబట్టి ఎవరైనా చర్చించుకోవచ్చు. దీనికి కూడా మహాకవి “వ్యక్తుల ప్రయివేట్ బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం” అని ఒక కవిత ద్వారా ఆ మహాకవి అనుమతి ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ విడాకులోపాఖ్యానం గూర్చి చర్చించుకోవడంలో దోషం లేదు.

జనసేన అనే పార్టీ పుట్టి నిండా ఏడేళ్లు కాలేదు. ఒకసారి బీజేపీతో పొత్తు. అదేసమయంలో తెలుగుదేశంతో మైత్రి. ఆ తరువాత మాయావతి పార్టీతో పొత్తు. ఆ తరువాత కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు. వీరందరితో విడాకులు కాగానే మళ్ళీ బీజేపీతో పొత్తు. తాజాగా బీజేపీతో కూడా విడాకులవరకు వచ్చేసింది! హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ కథ గుర్తుకు రావడం లేదూ? ఎవ్వరితోనూ కనీసం రెండేళ్లు కాపురం చేసిన ఘట్టం లేదు. ఎందుకు పెళ్లి చేసుకుంటారో, ఎందుకు విడాకులు ఇస్తారో పవన్ కళ్యాణ్ కే తెలియాలి.

ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్నీ చేర్చుకోవాలి. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు…వీరిద్దరూ విశ్వాసరాహిత్యానికి, విశ్వాసఘాతుకానికి నిలువెత్తు నిదర్శనాలు. బీజేపీకి జన్మనిచ్చి, రథయాత్ర ద్వారా పదిహేడేళ్లలోనే పార్టీని అధికారంలోకి తెచ్చి, బలమైన పునాదులను నిర్మించిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి మూలస్తంభాలను కరివేపాకుల్లా పక్కన పడేశారు మోడీ. వాజపేయి అదృష్టం బాగుండి అప్పటికి మోడీ జాతీయ రాజకీయాల్లో చురుకుగా లేక, కేవలం గుజరాత్ వరకే పరిమితం కావడంతో ఆయన ప్రధాని కాగలిగారు. అప్పటికే మోడీ ఇప్పుడున్నంత చురుకుగా ఉన్నట్లయితే వాజపేయి కూడా ప్రధానమంత్రి అయ్యేవారు కారేమో!

ఇక చంద్రబాబు నాయుడు సంగతి చెప్పాల్సిన పనిలేదు. తెలుగుదేశం పార్టీకి పుట్టుకనిచ్చి, పెంచి పెద్ద చేసిన నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీ అభివృద్ధికి కారకులైనవారందరిని దూరం చేసి విశ్వాసఘాతుకత్వానికి, వెన్నుపోటుకు బ్రాండ్ నేమ్ గా “ఖ్యాతి” నొందిన చంద్రబాబు తో స్నేహం చేశారు పవన్. ప్రతి చిన్న విషయానికి నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా దూషిస్తూ చంద్రబాబు దోపిడీని అవినీతిని నిస్సిగ్గుగా సమర్ధిస్తూ చివరకు ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయి భ్రష్టు పట్టాడు. ఎంత పలుకుబడి, ఎంత అభిమానుల సంఖ్య, ఎంత ప్రాచుర్యం, ఎంత ప్రచారం ఉంటే ఏమి లాభం? స్వయంకృతాపరాధాలతో, సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం చేతకాక, వ్యూహచాతుర్యం కొరవడి, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి, తన అసమర్ధతకు ఇతరులను నిందిస్తూ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి తాజాగా బీజేపీతో ఏడాదిక్రితం చేసుకున్న వియ్యానికి మంగళం పడేశారు పవన్ కళ్యాణ్.

రాజకీయాలు పౌరుషవంతులకు, ప్రతాపవంతులకే తప్ప ఇతరుల బలం మీద ఆధారపడి, అత్యాశకు పోయే పిరికివారికి కాదు అని జనసేనుడు మరోసారి నిష్కర్షగా నిరూపించారు! ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు