పవన్ కళ్యాణ్.. ఆ ఒక్క డైలాగ్ రిపీట్ చేయొద్దు ప్లీజ్

Janasena

జనసైనికుల్ని ప్రతిసారీ జనసేన అధినేత ఇరకాటంలో పడేస్తున్నారు. ‘వైఎస్ జగన్‌ని అదికారంలోకి రానివ్వను..’ అంటూ 2019 ఎన్నికల ప్రచారం సమయంలో జనసేన అధినేత నినదించారు. 2019 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం సంపాదించుకుంటుందని ఎవరూ అనుకోలేదుగానీ, టీడీపీదో.. లేదంటే వైసీపీదో గెలుపు అవకాశాన్ని దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. నిజమే.. టీడీపీకి దెబ్బ గట్టిగానే తగిలింది. నిజానికి, ఆ దెబ్బ తగలాల్సింది వైసీపీకి.. కానీ, అదృష్టం వైసీపీకి కలిసొచ్చింది. జనసైనికులు కూడా వైసీపీకి ఓటేసినట్లు స్వయంగా జనసేన అధినేత ఈ మధ్యనే చెప్పుకున్నారు. ఇలాంటి మాటలు జనసేనను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

Janasena leader is getting into trouble every time
Janasena leader is getting into trouble every time

గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి రాకుండా చేస్తానని చెప్పిన జనసేనాని, ఇప్పుడేమో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుని ఇంకోసారి అసెంబ్లీకి వెళ్ళకుండా చేస్తానంటూ సరికొత్త ప్రతిజ్న చేసేశారు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. జనసేనాని తాజా వ్యాఖ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘అంటే, వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు రికార్డు స్థాయి మెజార్టీతో గెలవబోతున్నారన్నమాట.. పవన్ ఆశీర్వాదం అలాంటిది..’ అని వైసీపీ శ్రేణులు జనసైనికుల్ని ర్యాగింగ్ చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రెండు చోట్ల పోటీ చేసి.. అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు. ఇది నిజంగానే పార్టీకి అవమానకరమైన ఓటమి. ఆ ఓటమి నుంచి జనసేన ఎలాంటి పాఠాలూ నేర్చుకున్నట్లు లేదు. రాజకీయాల్లో విమర్శలు, హెచ్చరికలు.. ఇవన్నీ మామూలే. అయతే, ప్రగల్భాలు పలికి.. దారుణమైన ఓటమిని చూస్తేనే.. రాజకీయాల్లో బఫూన్లుగా మారిపోతారు. ఆ పరిస్థితిని స్వయానా పవన్ కళ్యాన్ కొనితెచ్చుకున్నట్లవుతోంది. పవన్‌ని అభిమానించేవారు కూడా, ఆయన మాటల్లోని అపరిపక్వత పట్ల ముక్కున వేలేసుకునే పరిస్థితి వస్తోంది.