ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమైతే ప్రైవేటీకరణ చేయబోతోందో, ఆ పార్టీ బీజేపీ రాష్ట్ర శాఖ కూడా.. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా గళం వినిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు అత్యద్భుతమైన అవకాశం దక్కింది. ‘గల్లీ నేతలతో కాదు, ఢిల్లీ నేతలతోనే మనకు పని. ఢిల్లీలో మనకి మంచి గౌరవం దక్కుతోంది..’ అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నేరుగా ఢిల్లీకి వెళ్ళి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి, ఆ ప్రైవేటీకరణను ఆపగలగితే, జనసేన పార్టీకి అది రాజకీయంగా ఎంతో ఉపకరిస్తుంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌పై ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, ఇప్పుడైనా జనసేన అధినేతకు ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ దక్కుతుందా.? అందునా, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం పవన్ కళ్యాన్ దక్కించుకుంటారా.?
అన్నదే ఆసక్తకిరమైన అంశమిక్కడ. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరుల్ని కలవబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించేయడం గమనార్హం. అయితే, టీడీపీ నుంచి బీజేపీలోకి కొన్నాళ్ళ క్రితం దూకేసిన మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అన్న నినాదంలో అర్థం లేదని అంటున్నారాయన. వాటాదారులకు మేలు చేసేందుకే ప్రైవేటీకరణ అన్నది సుజనా చౌదరి వాదన. ప్రత్యేక హోదా విషయంలో కూడా సుజనా చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో టీడీపీ నేతగా వుండి, ప్రత్యేక హోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మరి, సుజనా మాటలే నిజమవుతాయా.? పవన్ ప్రయత్నాలు సఫలమవుతాయా.? ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి ఊపు రావాలంటే, ఇదొక ప్రతిష్టాత్మకమైన అవకాశం గనుక.. దీన్ని జనసేనాని సద్వినియోగం చేసుకోవాలి.