జనసేన పార్టీ మీద మొదటి నుండి ఇతర రెండు ప్రధాన పార్టీల్లోనూ ఒకింత చులక భావ ఉన్న సంగతి తెలిసిందే. పక్కన ఉన్నన్ని రోజులు పొగిడిన టీడీపీ నేతలు కుట్రలను గ్రహించి దోస్తీని తెంచుకుని పక్కకు వెళ్ళిపోతే ఎన్నికలకు ముందు జనసేన మీద ఎన్నెన్ని అవాకులు చెవాకులు పేలారో, ఇప్పటికీ వెళుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక వైసీపీ టీజింగ్ అయితే మరీ ఎక్కువ. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వైసీపీకి చెందిన శ్రేణులు జనసేనను కనీసం ఒక రాజకీయ పార్టీ కింద, ఆ పార్టీ శ్రేణులను కార్యకర్తల కింద కూడ లెక్కచేయరు. ప్రశ్నిస్తే కించపరిచి మాట్లాడటం తప్ప ఏనాడూ సరైన సమాధానం చెప్పిన సందర్భం లేదు.
పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడ గెలవలేదని,ఎమ్మెల్యే కాలేని వాడికి సీఎంను ప్రశ్నించే సీను ఉందా అని ఎద్దేవా చేస్తుంటారు. ఆ పార్టీ కార్యకర్తలే కాదు నాయకులూ అంతే. అంటే వారు గెలిచినవారే ప్రశ్నించాలనే రూల్ రాజ్యాంగంలో ఉందని అనుకుంటున్నారేమో. ఎంతసేపూ పవన్ చంద్రబాబుకు బీ టీమ్ అనడమే తప్ప నిరూపించిన నిఖార్సైన వ్యక్తి ఒక్కరూ లేరు వైసీపీలో. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరేంటి మమ్మల్ని ప్రశ్నించేది అన్నట్టే ఉంటారు ఆ పార్టీ నాయకులు చాలామంది. జనసేన జెండా పట్టుకున్న వ్యక్తిని చూస్తేనే ఏదో జోకర్ ను చూసినట్టు కామెంట్లు, వీళ్లేంటి పొడిచేది అనే చులకన భావన. ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా కనీసం ఒక్క ఓటు పొందినా సరే ఆ పోటీదారునికి ఆ ఒక్క ఓటరు తరపున నాయకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత ఉంటుంది.
ఇవన్నీ చదువుకోమని ఎక్కడా రాసి ఉంచరు. ఇంగితంలో తెలియాలి అంతే. జనసేన గత ఎన్నికల్లో 5.53 శాతం ఓట్ షేర్ సాధించింది. కాబట్టి ఆ పార్టీ నాయకులకు, శ్రేణులకు పాలకులను ప్రశ్నించే హక్కు ముమ్మాటికీ ఉంటుంది. అత్యధిక ఓట్లతో పీఠం మీద కూర్చుని పాలన చేస్తున్నారు కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల మీద, టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచినవారి మీద ఉంది. కానీ అవేవీ చేయరు ఆ పార్టీల నేతలు. ప్రశ్నించినవారిని అవహేళన చేయడమో, వేధించడమే తప్ప. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుగారిని రోడ్ల మరమ్మత్తుల విషయమై ప్రశ్నించారు.
ఆ సమయంలో అతని మీలో జనసేన కండువా ఉంది. వెనకున్నవారి చేతిలో జెండాలున్నాయి. వాటిని చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వీడియోలు చూస్తే ఏమన్నారో తెలుస్తుంది. ఆ మాటలు నిజంగా అవమానకరమైనవే. చేతిలో జనసేన జెండా చూసి ఆగ్రహించారు తప్ప ఎదురుగా ఉన్నవారు నోటితో చెప్పుకున్న సమస్యను విని పరిష్కారం చెప్పలేకపోయారు ఎమ్మెల్యే. ఆ తర్వాత కూడ వెంగయ్య ఇంటికి కొందరు వ్యక్తులు వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించి భయాందోళనలకు గురిచేశారని, అందుకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ వేధింపుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే మీద న్యాయపోరాటానికి దిగుతామంటున్నారు.
ఇలాంటి వేధింపుల ఆత్మహత్యే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా హైలెట్ కాలేదు. మరి ఎన్నో చోట్ల జరుగుతున్న బెదిరింపులు, దాడులు, అవహేళననలు ఎలా బయటకు వస్తాయి. జనసేన శ్రేణులను కదిలిస్తే మాత్రం ప్రధాన పార్టీల తీరు ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు చెబుతుంటారు.