‘తెలంగాణలో మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు..’ అంటూ అహంకారం ప్రదర్శించడం ద్వారా భారతీయ జనతా పార్టీ, ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టపోయింది. దాంతో, తెలంగాణ బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు.. మిత్రపక్షం జనసేనతో చర్చలు జరిపారు. ఖమ్మం మునిసిపల్ ఎన్నికల కోసం జనసేన – బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. నిజానికి, బీజేపీతో సంబంధం లేకుండా ఒంటరిగానే ఖమ్మం సహా, స్థానిక పోరు జరుగుతున్న ఇతర స్థానాల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. కానీ, ఇంతలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వం, జనసేన పార్టీతో చర్చల ప్రక్రియకు తెరలేపింది. దాంతో, జనసేన కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్నదానిపై త్వరలో ఇరు పార్టీలూ ఓ నిర్ణయానికి వస్తాయట.
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో జనసేనకు వెన్నపోటు పొడిచింది బీజేపీ. అయినాగానీ, జాతీయ నాయకత్వం సూచన మేరకు, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి కొద్దో గొప్పో ఓట్లు, సీట్లు సాధించి వుంటే, తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గ్లాసు’ పదిలంగా వుండి వుండేది. ఇప్పుడేమో, ఆ గాజు గ్లాసు విషయమై జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఎప్పటికప్పుడు జనసేన పార్టీని బీజేపీ అవమానిస్తున్నా, జనసేన పార్టీ సర్దుకుపోతుండడం జనసైనికులకు అస్సలు మింగుడపడ్డంలేదు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ కాకుండా జనసేన పోటీ చేసి వుంటే, గెలుపోటములతో సంబంధం లేకుండా జనసేన రాజకీయంగా బలపడే అవకాశం వుండేది.