జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కార్యకర్తలే కాదు పవన్ కళ్యాణ్ సైతం ఊహించలేని స్థితిలో ఉన్నారు. రాజకీయాలను సమూలంగా మార్చేస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు ఆ రాజకీయాలకు తగ్గట్టు తానే మారిపోతున్నారు. మొదటి నుండి నాకు బలం లేదు అందుకే పొత్తులు అంటూ ఆంధ్రాలో ఒక్క కాంగ్రెస్, వైసీపీలతో తప్ప మిగతా అందరితోనూ పొత్తు పెట్టుకున్నారు పవన్. కానీ ఏ పొత్తూ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. రాజకీయంగా జనసేనను ఒక్క మెట్టు కూడ పైకి ఎక్కించలేకపోయాయి. పార్టీ పెట్టిన కొత్తలో తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసిన ఆయన 2019 నాటికి విడిపోయారు.
ఆ పొత్తులో పవన్ పొందిన ప్రయోజనం సున్నా కాగా చంద్రబాబుకు బీ టీమ్ అనే ముద్ర వేయించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆ ముద్రే జనసేనను భారీగా దెబ్బతీసింది. వైసీపీ ఆ అంశాన్ని బ్రహ్మాండంగా వాడుకుని టీడీపీ వ్యతిరేక ఓట్లను మొత్తంగా గుంజేసుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వామపక్షాలతో దోస్తీ చేశారు. మధ్యలో బిఎస్పీని కూడ కలుపుకున్నారు. ఆ కూటమి కూడ ఎన్నికలకు ముందే బీటలువారి ఎన్నికల్లో పటాపంచలయింది. మొన్నటివరకు భావాలు కలిశాయి పవన్ మావాడే అన్న వామపక్షాలే ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నాయి. అలా రెండవ రిలేషన్‌షిప్ కూడ డిజాస్టర్ అయింది.
ఇక ఈమధ్యే ఢిల్లీ వెళ్లి బీజేపీతో చేయి కలిపి వచ్చిన పవన్ ఈసారైనా ఎదిగే ప్రయత్నం చేస్తారని జనసేన శ్రేణులు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. కానీ పవన్ తీరులో మార్పు రాలేదు. అదే మౌనం, అదే సందిగ్ధం. ఎక్కడా బీజేపీతో కలిసి నడుస్తున్న దాఖలాలు లేవు. అసలు ఉద్దేశ్యాల్లోనే రెండు పార్టీలకు బోలెడంత సారూప్యత ఉంది. అదే జనసేనానికి బీజేపీకి దూరం పెంచుతోంది. ఇదిలా ఉంటే అధికార వైసీపీ ఎన్డీయే క్యాబినెట్లో భాగస్వామ్యం కానుందని, జగన్ ఢిల్లీ వెళ్లి తన చేరికను కన్ఫర్మ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాతావరణం కూడ అలానే ఉంది.
మరిప్పుడు పవన్ ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. బీజేపీ అంటే రెండు నాల్కల ధోరణికి అలవాటు పడింది కాబట్టి ఢిల్లీలో జగన్, మోదీ భాయి భాయి అంటే రాష్ట్రంలో సోము వీర్రాజు పాలక పక్షం మీద ఏదో నామమాత్రపు విమర్శలు, పోరాటాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తారు. అప్పుడిక స్నేహం చేస్తున్నాడు కాబట్టి పవన్ కూడా రాష్ట్ర బీజేపీ యొక్క ద్వంద వైఖరిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదంటే నిజాయితీగా పాలక వర్గాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే జనసేన శ్రేణులు తెగదెంపులు చేసుకుని కష్టమో నష్టమో ఒంటరిగానే నడవాలనే ఆలోచనలో ఉన్నాయి. మరి పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. సో.. ఎటొచ్చీ పవన్‌కు ఈ మూడవ రిలేషన్‌షిప్ కూడ మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యేలా ఉంది.