ఆయనంటే జనసేనకు అంత వెటకారమా.?

Janasainiks mind game with MLA Rapaka

Janasainiks mind game with MLA Rapaka

జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలుచుకున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోతే, రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, రాజకీయ పార్టీగా జనసేన పార్టీ బలోపేతమయ్యేందుకు సరైన దారిలో నడవకపోవడం సహా అనేక కారణాలు చూపిస్తూ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జనసేనకు దూరమై, అధికార వైసీపీకి దగ్గరయ్యారు. అయితే, ‘పేరుకి జనసేన ఎమ్మెల్యేనే అయినా తాను వైఎస్ జగన్ అభిమానిని..’ అని చెప్పుకోవడం ద్వారా రాపాక వరప్రసాద్ తన స్థాయిని తగ్గించేసుకున్నారనే విమర్శ వుంది.

అసలు విషయంలోకి వస్తే, తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జనసేన పార్టీ నిర్వహించిన ఓ సమావేశం కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతూ ఏర్పాటు చేసిన కొన్ని బ్యానర్లలో ‘మీకు ప్రవేశం లేదు’ అంటూ రాపాక వరప్రసాద్ ఫొటోతో ఎమ్మెల్యేని కించపర్చే ప్రయత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే విషయంలో జనసేన ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది.? అన్న చర్చ జరుగుతోంది. అయితే, రాపాక వరప్రసాద్ జనసేనకు చేసిన ద్రోహం ముందు తాము ఆయనకు చేసిన అవమానం చిన్నదేనన్న భావనలో జనసేన కార్యకర్తలున్నారు. రాపాక అయితే, జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళారుగానీ.. నియోజకవర్గంలో జనసైనికులెవరూ రాపాక వెంట వెళ్ళలేదన్న అభిప్రాయం బలంగా వుంది. పంచాయితీ ఎన్నికల్లో కూడా ఇదే స్పష్టమయ్యింది. ‘మీ పల్లకీని మోసం మేం..’ అంటూ రాపాకపై అసహనంతో బ్యానర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు తగిన శాస్తి చేశామన్నది జనసైనికుల వాదన. అయినాగానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి అవాంఛనీయమైన ఘటనలు.