జనసేనను నిండా ముంచేస్తోన్న ‘యెల్లో’ గాసిప్స్.!

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళుతుందా.? లేదంటే, పాత మిత్రుడు చంద్రబాబు పంచన జనసేన అధినేత చేరబోతున్నారా.? ఈ విషయమై రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. టీడీపీకి జనసేనతో అవసరం వుంది. జనసేనకు మాత్రం నిజానికి ఎవరితోనూ అవసరం లేదు. జనసేన రాజకీయ ఆలోచనలు వేరు.

అయితే, జనసేనను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి పనిచేసేలా చూడాలని ‘యెల్లో’ మీడియా తహతహలాడుతోంది. టీడీపీ – జనసేన కలిస్తే, టీడీపీకి వచ్చే లాభం అలాంటిది మరి. 2014 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశా. సో, జనసేనను టీడీపీ వదులుకోకపోవచ్చు. అయితే, జనసేన మాత్రం టీడీపీ వైపు అస్సలు చూడటంలేదు.

ఇక్కడే నడుస్తోంది అసలు సిసలు మ్యాజిక్. టీడీపీతో జనసేన కలవాల్సిన ఆవశ్యకత గురించి వైసీపీ, బీజేపీ తెగ ఆరాటపడిపోతున్నాయి. అలా కలవడం వల్ల ఆ రెండు పార్టీల్నీ భూస్థాపితం చేసెయ్యొచ్చని వైసీపీ, బీజేపీ భావిస్తున్నాయి. బీజేపీ, ప్రస్తుతానికి జనసేనకు మిత్రపక్షం. కానీ, వైరిపక్షంలా జనసేన విషయంలో బీజేపీ మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. దీన్ని జనసైనికులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

వరుసగా తాను చేయాల్సిన సినిమాల షూటింగుల్ని పూర్తి చేసేసుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీలైనంత త్వరగా వాటిని ఓ కొలిక్కి తీసుకొచ్చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టనున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.

ఏపీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ కానున్న పవన్ కళ్యాణ్, ఈ మేరకు పార్టీ శ్రేణులకూ స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే, టీడీపీ విషయంలోనే పార్టీ శ్రేణులకు జనసేనాని మరింత స్పష్టనివ్వాల్సి వుంది. లేదంటే, టీడీపీతోనే జనసేన కలిసి వెళుతుందన్న దుష్ప్రచారాన్ని జనసైనికులు కూడా విశ్వసించాల్సి వస్తుంది.

ఇదిలా వుంటే, జనసేన ఈసారి గెలవాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పని చేయాలనీ, అలా పోటీ చేయడం వల్ల జనసేనకూ సీట్లు వస్తాయని ఓ చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జనసేన గనుక 25కి పైగా ఎమ్మెల్యేలను పొందగలిగితే, ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు వుంటుందనీ, లేని పక్షంలో ప్రస్తుత రాజకీయాల్లో జనసేన ముందుకు నడవడం అసాధ్యమనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ, జనసేన అంచనాలు వేరేలా వున్నాయి. సోలోగా పోటీ చేసి అధికారంలోకి రాగలమన్న ధీమా జనసేనలో వుంది. బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల నష్టమే తప్ప, లాభం లేదన్నది జనసేన అంతరంగం.