ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి ఓ పాయింట్ దొరకపుచ్చుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేశారు. వ్యాక్సినేషన్ వైఫల్యాలపై ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడంలేదు.? అంటూ ప్రశ్నించేశారు జైరాం రమేష్.
చిత్రమేంటంటే, వ్యాక్సినేషన్ వైఫల్యం గురించే నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ విషయమై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ప్రధాని పేరు ప్రశ్నించకపోయినా, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైఎస్ జగన్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖ గురించి దేశమంతా చర్చించుకుంటోంది.
ఆ విషయం కాస్త లేటుగా కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టుంది. అయినా, దేశంలో వ్యాక్సినేషన్ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ఎవర్ని ప్రశ్నించాలి.? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని. ఏపీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, మాజీ కేంద్ర మంత్రి ప్రశ్నించడం వల్ల ఒరిగేదేంటి.? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో నూకలు చెల్లిపోయాయి. అది కాంగ్రెస్ పార్టీ చేసిన స్వీయ తప్పిదం తాలూకు ఫలితం.
నిజానికి, కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వుండి వుంటే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దయనీయ స్థితిని ఎదుర్కొని వుండేది కాదు. అసలు ఉమ్మడి రాష్ట్రం విడిపోయేదే కాదేమో. దేశంలోనూ కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రం ఒకింత అదనపు బలాన్ని ఇచ్చి వుండేది. విభజన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, పార్టీని తెలుగు నాట భ్రష్టు పట్టించిన జైరాం రమేష్, ఇప్పుడు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి గురించి విమర్శనాస్త్రాలు సంధించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?