చంద్రబాబుకి ‘జై ఎన్టీయార్’తో తలనొప్పి.!

ntr

యంగ్ టైగర్ ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ కోసం గతంలో ప్రచారం చేశారు. కానీ, ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ‘జై తెలుగుదేశం’ అన్నది లేదు. అసలు తెలుగుదేశం పార్టీ వైపు చూడలేదు. ఆ మాటకొస్తే, ఆయన్ని టీడీపీకి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.

నిజానికి, యంగ్ టైగర్ ఎన్టీయార్ వల్ల టీడీపీకి లాభం తప్ప, నష్టం లేదు. కానీ, అక్కడికేదో ఎన్టీయార్ వల్ల టీడీపీకి నష్టం.. అన్నట్లు పార్టీలో కొందరు వ్యవహరిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద అప్పుడప్పుడూ విమర్శలూ చేస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతోందన్న వాదన లేకపోలేదు.

ఆ సంగతి పక్కన పెడితే, పదే పదే ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఝలక్ తగులుతోంది. అదీ, ‘జై ఎన్టీయార్’ నినాదాల రూపంలో. ఆ నినాదాలతో కూడిన జెండాలూ చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని చంద్రబాబు దగ్గర చేసుకుంటే టీడీపీకి లాభం వుంటుంది. దగ్గర చేసుకోకపోయినా ఫర్లేదు, దూరం చేసుకోకుండా వుంటే, టీడీపీకి లాభమే. కానీ, యంగ్ టైగర్‌ని దూరం పెట్టేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అదే యంగ్ టైగర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

టీడీపీ పగ్గాలు యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ఇచ్చెయ్యాలన్న డిమాండ్ చాలాకాలంగా వుంది. అయితే, సినిమాల్ని వదిలేసుకుని యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. బాలకృష్ణలా రాజకీయాల్లో వుండీ లేనట్టు వ్యవహరించడం ఎన్టీయార్‌కి సాధ్యం కాకపోవచ్చు.