ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి తన ఓటమిని ఒప్పుకున్నారు. రైతులకి, దేశ ప్రజలకీ క్షమాపణ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ దిగొచ్చారు. ఆ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుంటామని నరేంద్ర మోడీ వెల్లడించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
దేశంలో ఏ రైతు అయినా తన పంటని ఎక్కడైనా అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కొత్త వ్యవసాయ చట్టాల్ని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ శక్తులకు లాభం తప్ప, రైతులకు ఉపయోగం లేదనీ, రైతులపై కార్పొరేట్ శక్తుల పెత్తనం పెరిగిపోతుందనీ రైతు సంఘాలు ఆందోళనచెందాయి.. ఉద్యమబాట పట్టాయి.
రోజులు, నెలల తరలబడి రైతులు చేసిన ఉద్యమం విజయతీరాలకు చేరింది. నరేంద్ర మోడీ సర్కార్ మెడలు వంచగలిగింది రైతు ఉద్యమం. దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాల్సి రావడమంటే, ఇంతకన్నా పెద్ద విజయం ఏ ఉద్యమానికైనా ఏముంటుంది.?
దేశవ్యాప్తంగా రైతులు ఒక్కతాటిపైకి రావడంతోనే ఇంత పెద్ద విజయం సాధ్యమయ్యిందని వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, పార్లమెంటులో కొత్త వ్యసాయ చట్టాలకు మద్దతిచ్చి, బయటకొచ్చి వాటికి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు నినదించిన సంగతి తెలిసిందే.. ఆ రాజకీయ పార్టీలకు ఇప్పుడెలా మాట్లాడాలో తెలియని పరిస్థితి.
ఒక్కటి మాత్రం నిజం.. రైతులు వద్దంటున్న చట్టాల్ని, వాళ్ళని ఉద్ధరించేస్తామనే పేరుతో బలవంతంగా రుద్ధడం అనేది కేవలం రాజకీయ దురహంకారం మాత్రమే. అహంకారాన్ని వీడి, రైతుల ఆవేదన అర్థం చేసుకున్నందుకు మోడీ సర్కారుని అభినందించాలా.? ఇన్నాళ్ళపాటు రైతుల్ని మనో వేదనకు గురిచేసి, చాలామంది రైతుల మరణానికి కారణమైనందుకు నిందించాలా.?