భారతదేశంలో కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ, సమస్యకు మాత్రం పరిష్కారం లభించడంలేదు. చట్టాల అమలును కొంత కాలం పాటు నిలుపుదల చేయడానికి కేంద్రం ఒప్పుకుందంటేనే, ఆ చట్టాల్లో ఎక్కడో తేడా వుందని అర్థం. లేకపోతే, ‘మేం రైతులకు మేలు చేయడానికే ఈ చట్టాలు తెచ్చాం..’ అని కేంద్రం ఎందుకు గట్టిగా చెప్పలేకపోతోంది.? సరే, రైతుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం, పూర్తిగా ఈ సాగు చట్టాల అమలును నిలిపివేస్తుందా.? మధ్యేమార్గంగా ఏదన్నా పరిష్కారం ఈ సమస్యకు లభిస్తుందా.? అన్నది వేరే చర్చ. కానీ, ఈలోగా విదేశీ సెలబ్రిటీలు మన రైతుల మీద మొసలి కన్నీరు కార్చేస్తున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందనీ, పౌర హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ సోషల్ మీడియా వేదికగా విదేశీ సెలబ్రిటీలు దుష్పచారం మొదలు పెట్టారు. దాంతో, మన సెలబ్రిటీలు కూడా గళం విప్పాల్సి వస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పటికే స్పందించింది. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనదైన స్టయిల్లో ‘విదేశీ పైత్యానికి’ చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సచిన్ టెండూలర్కర్‌తో గొంతు కలిపాడు. విభేదాలు తలెత్తిన ఈ సమయంలో మనమంతా ఐకమత్యంగా వుండాలని పిలుపునిచ్చాడు కోహ్లీ. స్నేహపూర్వక పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకోసం అన్ని పార్టీలు, వర్గాలు సమైక్యంగా ఒక్కతాటిపైకి రావాల్సి వుందన్నాడు. అయితే, కోహ్లీని కొందరు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క సచిన్ కూడా విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. పార్లమెంటులో ఏనాడూ ప్రజాసమస్యలపై స్పందించని సచిన్ కూడా సోషల్ మీడియాలో నీతులు చెబుతున్నాడంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా, రైతు ఉద్యమంలోకి అసాంఘీక శక్తులు చొచ్చుకువచ్చి, దేశ రాజధానిలో అలజడి సృష్టించడం, భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎర్రకోట మీద జాతీయ జెండాకి అవమానం కలిగించిన నేపథ్యంలో.. దేశమంతా ఒక్కతాటిపైకి రావాల్సిందే. అదే సమయంలో, కేంద్రం కూడా బేషజాలకు పోకుండా వివాదానికి శాంతియుత పరిష్కారం చూపాల్సి వుంది. సమస్యను సాగదీసే కొద్దీ, విదేశీ శక్తులు భారతదేశం ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తాయన్నది నిర్వివాదాంశం.