కేసీయార్‌కి జగ్గారెడ్డి బంపర్ ఆఫర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించేశారు. సమైక్యాంధ్రకు కేసీయార్ మద్దతిస్తే, తాను కేసీయార్ వెంట నడవడానికి సిద్ధమని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత ఒకరు, సమైక్య నినాదంతో కేసీయార్‌కి మద్దతిస్తాననడం ఆశ్చర్యకరమైన విషయమే.

ఇటీవల కేసీయార్, తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయాలంటూ తమకు వినతులు అందుతున్నాయని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తెలుగునాట రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన రీతిలో రాజకీయ నాయకుల నుంచి ప్రకటనలు దూసుకొస్తున్నాయి.

కేసీయార్ నేతృత్వంలో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం విజయతీరాలకు చేరింది.. తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ వేరు పడింది. కాదు కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వేరు పడింది.

కొత్త పేరుతో పాత రాష్ట్రం తెలంగాణ అయితే.. పాత పేరుతో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆదాయం తెలంగాణకీ, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కీ అన్నట్టు తయారైంది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేసుకోలేకపోతోంది.. కేంద్ర సాయం అందుతున్నాగానీ.

సరే, ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కారణం ఏంటి.? అన్నది వేరే చర్చ. మళ్ళీ సమైక్య రాష్ట్రం ఏర్పడితే.? అన్న చర్చ జరుగుతుండడం శుభ పరిణామమే. కానీ, రాజకీయ రాబందులు సమైక్య ఆలోచనలకి అడ్డుతగలకుండా వుంటాయా.? ఛాన్సే లేదు.