ఏపీలో ఆలయాల మీద దాడుల ఘటనలు పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు అన్నీ కలిసి అధికార వైసీపీని టార్గెట్ చేస్తుంటే వైసీపీ కూడ అంతే ధీటుగా అందరికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ, టీడీపీలను ఏకిపారేస్తున్నారు. మొన్నా మధ్యన అశోక్ గజపతిరాజు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుగారు ఆలయాల మీద దాడుల విషయంలో ఇంకా నిందితులను తేల్చనందుకు డీజీపీని రాజీనామా డిమాండ్ చేశారు.
దీన్ని ప్రస్తావించిన వెల్లంపల్లి ఏకంగా మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అంతర్వేది రథం ధగ్ధం కేసును నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తే ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు, నిందితులను ఎందుకు పట్టుకోలేదు. సీబీఐకి అప్పగించమని మీరు డిమాండ్ చేస్తేనే అన్ని వివరాలతో జీవో ఇచ్చాం. కానీ ఈనాటికి దోషులను పట్టుకోలేదు. ఈ నాలుగు నెలలు కేంద్రం గాడిదలు కాస్తోందా, ఎందుకు భయపడుతున్నారు. అసలు డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలి. నిజాలు మాట్లాడినందుకు, మీ తరపున మాట్లాడనందుకు రాజీనామా చేయాలా. ఇదేనా మీ రాజకీయ నీతి అంటూ కడిగిపారేశారు.
అంతేకాదు తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇలా మత విద్వేషాలను రెచ్చగోట్టడం మంచిది కాదని, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే పార్టీలు సీఎం జగన్‌ను బెదిరించలేవని అన్నారు. మంత్రి అడిగే ప్రశ్నల్లో కూడ లాజిక్ ఉంది. అంతర్వేది ఘటన జరిగినప్పుడు బీజేపీ ఎంత రాద్ధాంతం చేసింది అనేది అందరరూ చూశారు. దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర ఉందని, కాబట్టి కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని, కేంద్రం కలుగజేసుకుని నిజాల్ని రాబడుతుందని. అక్కడైతేనే న్యాయం జరుగుతుందని ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. మరి ఈ ప్రశ్నకు సోము వీర్రాజుగారు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.