కృష్ణా పుష్కరాల సమయంలో అభివృద్ధి పేరుతో సుమారు నలభై ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చేస్తున్న దృశ్యాలు చూసి చలించిన ఒక తెలుగుదేశం నాయకుడు నాకు ఫోన్ చేసి “మా వినాశనం మొదలైంది. చంద్రబాబుకు అసలు భక్తి లేదు. భకుల మనోభావాలతో పనిలేదు. ఆయనకు వ్యాపారమే ముఖ్యం. దైవాపచారం మమ్మల్ని కూలుస్తుంది” అని వాపోయాడు! ఏ ముహూర్తంలో ఆయన ఆ మాటలు అన్నాడో కానీ, కనీసం పదిహేనేళ్ళు అధికారంలో ఉంటాడని నమ్మిన ఆయన పార్టీవారి కలలను భగ్నం చేస్తూ మూడేళ్ళలోనే చంద్రబాబు ఘోరమైన పతనాన్ని చవిచూశారు.
చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో హిందూ మతానికి, ఆధ్యాత్మిక కేంద్రానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఎవరో కొందరు ముస్లిం రాజులు హిందూ దేవాలయాల మీద దాడులు చేశారని, ఆలయాలను విధ్వంసం గావించారని మనం చరిత్ర పాఠాల్లో చదువుకున్నప్పటికీ, పరమతసహనాన్ని పాటించిన అక్బర్ లాంటి చక్రవర్తులు కూడా మనకు కనిపిస్తారు. నిజాం ప్రభువులు సైతం హిందూ దేవాలయాలను రక్షించారు. దేవాలయాల నిర్వహణకు అగ్రహారాలు దానం చేశారు. తెలంగాణలోని అనేక ప్రముఖ దేవాలయాలకు ముస్లిం రాజులు భూరి విరాళాలు ఇచ్చారు.
కానీ, ఈరోజు హిందుత్వానికి తానే ప్రతినిధిని అని నుదుట కుంకుమ ధరించి పోజులు కొడుతున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి పురాతనమైన వెయ్యికాళ్ల మంటపాన్ని ధ్వంసం చేయించారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణానది ఒడ్డున ఉన్న నూరేళ్ళ చరిత్ర కలిగిన చిన్న చిన్న ఆలయాలను బుల్డోజర్లతో లేపేశారు. పవిత్రమైన ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి ఆలయాల్లో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయించి అపవిత్రం చేశారు. ఆయన ఈరోజు మతోద్ధారకుడిగా పోజులు కొడుతూ హిందూ మతానికి జగన్ ద్రోహం చేస్తున్నాడని, దేవుళ్ళకు రక్షణ లేకుండా పోతున్నదని నడిబజారులో నిలబడి గావుకేకలు పెడుతున్నారు…జనం జ్ఞాపకశక్తి మీద ఆయనకు ఏమాత్రం నమ్మకం లేదు మరి!! చంద్రబాబు నైజం తెలిసీ కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు భజనలు చేస్తూ, పక్కవాయిద్యాలను మోగిస్తూ తమ పతనాన్ని తామే శాసించుకుంటున్నారు! వారి ప్రారబ్ధకర్మ అలా ఉంటే ఎవరేమి చెయ్యగలరు?
ప్రతిపక్షాల కాకిగోలను పూర్వపక్షం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరూ తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. చంద్రబాబు చేతుల్లో నిహతులైన దేవుళ్లను మళ్ళీ ప్రతిష్ట చేసి ప్రజలు పూజించుకునేట్లు చెయ్యాలని సంకల్పించారు. డెబ్బై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రధమదశలో తొమ్మిది దేవాలయాలను పునరుద్ధరించాలని జగన్ నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షాల కుతంత్రాలను, కుట్రలను నిలువరించే చర్యగా చెప్పుకోవచ్చు. కనకదుర్గమ్మవారిని సందర్శించుకుని ఈ పవిత్రమైన యజ్ఞాన్ని నిర్వహించబోతున్న జగన్మోహన్ రెడ్డి గొప్ప అదృష్టవంతుడు. జగన్ చేతులమీదుగా శంకుస్థాపన గావించబడుతున్న ఈ ఆలయాలు అతి త్వరలో మళ్ళీ జగన్ చేతులమీదుగానే ప్రారంభం అవుతాయని చెప్పుకోవడంలో ఏమాత్రం మొగమాటపడాల్సిన పనిలేదు. ఎందుకంటే చంద్రబాబులా జగన్ ఆరంభశూరుడు కాదు. ఆయన ప్రారంభశూరుడు.
పాలకుడు ఏ మతస్తుడు అనేది ప్రజలకు అనవసరం. ఆయన సర్వమతసమ్మతంగా పాలిస్తున్నారా లేదా అనేదే ప్రజలకు కావాల్సింది. వయసులో చిన్నవాడైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిపూర్ణజ్ఞాన పురుషుడు!
రత్నాలను కాళ్ళకింద పెట్టినంత మాత్రాన వాటి విలువ తగ్గదు. గాజుపూసలను నెత్తిమీద పెట్టుకున్నంతమాత్రాన వాటి విలువ పెరగదు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అదే!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు