చినుకులు పడితే జలమయం.. జగనన్న కాలనీల పరిస్థితి ఇంత దారుణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగనన్న కాలనీలు చినుకులు పడితే చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కువ రోజుల పాటు వాన నీరు నిలిచి ఉండటంతో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. జగన్ సర్కార్ కొన్ని ప్రాంతాల్లో చెరువులను ఆనుకుని ఉన్న స్థలాలలో పొలాలలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఏపీలో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండగా కాలనీలలోకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన రోడ్లు సైతం గుంతలమయం కావడం గమనార్హం.

ఏపీలోని మెజారిటీ లేఅవుట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలోని బందరులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా చిన్నపాటి వర్షాలకే వాన నీరు నిలిచిపోతుండటంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ప్రాంతంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాల తాకిడికి గ్రావెల్ రోడ్లు దెబ్బతినడంతో లబ్ధిదారులు నిర్మాణసామాగ్రిని సైతం దూరం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోగట్టా.

జగన్ సర్కార్ జగనన్న కాలనీలలో మెరక, చదును పనులు చేయడానికి ఏకంగా 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భారీస్థాయిలో డబ్బులు ఖర్చు చేసినా ఖర్చుకు తగిన స్థాయిలో ఫలితం అయితే కనిపించడం లేదని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని పలు గ్రామాలలోని లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు చెరువులను తలపిస్తున్నాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.

వర్షాలకు లేఅవుట్లలో నీరు నిలుస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కంగారు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని ఏనుగుపల్లి లంకలో వరద నీటితో లేఅవుట్ మునిగిపోయింది. జగన్ సర్కార్ జగనన్న కాలనీల లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు ముంపుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏపీలో పలు ప్రాంతాల్లో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో లబ్ధిదారుల నుంచి నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.