వైకాపాలో నెంబర్-2గా పేరుగాంచిన విజయసాయిరెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఎప్పటి నుంచో పొలిటికల్ కారిడార్ లో కొనసాగుతోన్న చర్చకు జగన్ నేటితో పుల్ స్టాప్ పెట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించి షాక్ ఇచ్చారు. విజయసాయిని కేవలం ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేసారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతల్ని మాత్రమే విజయసాయి చూసుకునేలా అదిష్టానం డిసైడ్ చేసింది. ఇక గోదావరి జిల్లాలు, కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతల్ని టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి అప్పగించారు.
కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అదిష్టానం నుంచి ఇది ఊహించని ట్విస్ట్ అనే అనాలి. కొన్ని నెలలుగా పార్టీ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై పార్టీ సహా ఇతర పార్టీలు, పొలిటికల్ కారిడాల్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈనేపథ్యంలో జగన్ తాజా నిర్ణయంతో వాటన్నింటికి పుల్ స్టాప్ పడింది. అయితే కేంద్ర కార్యాలయ సమన్వయ వ్యవహారం కీలకం కాబట్టి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? అని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ విషయంలో తొలి నుంచి విజయసాయి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి పేర్లు పోటా పోటీగా వినిపించాయి.
చివరిగా జగన్ మనసులో సజ్జలే ఉన్నట్లు నేటితో తేలిపోయింది. అయితే నేడు విజయసాయి పుట్టిన రోజు నాడు జగన్ ఈ విషయాన్ని రివీల్ చేయడం పార్టీలో చర్చకొస్తుంది. ఈ రోజు జగన్ విజయవాడలో అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉంటే…విజయసాయి వైజాగ్ లో ఉన్నారు. వైకాపా మంత్రులు, నేతలు ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించి విమర్శలెదుర్కున్నారు.