YS Jagan: అసెంబ్లీ సమావేశాలు: అనుకున్నట్లే చేసిన జగన్.. ఒక్క హాజరుతో 60 రోజుల సేఫ్!

ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా వేడెక్కాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం చర్చనీయాంశమైంది. తమను అధికార ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, స్లోగన్స్ ఇవ్వడం సభా కార్యక్రమాలను తీవ్రంగా అడ్డు పడింది.

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో హాజరు కావడం చాలా రోజుల తర్వాత జరిగింది. అయితే, సభా కార్యకలాపాల్లో సమయాన్ని గడపడం కన్నా, వాకౌట్ చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు కనిపించింది. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఇది ప్రజాస్వామిక విలువలను కాదని ప్రవర్తనగా కొందరు విమర్శిస్తున్నారు.

ప్రజా సమస్యలపై చర్చించేందుకే సభకు హాజరయ్యామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలకు వ్యతిరేకంగా, గవర్నర్ ప్రసంగం కూడా పూర్తిగా వినకుండానే బయటకు రావడం విమర్శలపాలైంది. అసలు అసెంబ్లీకి వచ్చిన ఉద్దేశం గవర్నర్ ప్రసంగం వినడమా, వాకౌట్ చేయడమా అనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.

ఇక జగన్ హాజరు వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనే వాదన కూడా నడుస్తోంది. 60 రోజుల వరకూ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే పరిస్థితి ఉండటంతో, కేవలం హాజరు నమోదుచేసుకోవడమే లక్ష్యంగా జగన్ వచ్చి వెళ్లారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నంత వరకు జగన్ మళ్లీ హాజరవుతారా, లేక ఈ హాజరుతో తన బాధ్యతను ముగించినట్టు భావిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. “జగన్ అసెంబ్లీకి వచ్చి, ఫొటోకు పోజ్ ఇచ్చి, గందరగోళం చేసి, తిరిగి వెళ్లిపోయాడు” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, అసెంబ్లీ వేదికపై ప్రజా సమస్యలు చర్చించాల్సిన చోట ఈ విధంగా గందరగోళం, వాకౌట్ చేయడం అసెంబ్లీ గౌరవాన్ని తక్కువ చేసే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మోహన్ బాబు వెనుక కుట్ర | Thota Prasad About Mohan Babu | Chiranjeevi | Balakrishna | Telugu Rajyam