ఎన్నికల కమిషన్ నిబంధనలు దేశమంతా ఒకలా అమలవుతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరోలా అమలు చేస్తానని అంటున్నారు ఎన్నికల ప్రధాన అధికారి! అలా ఎందుకు? అని అడుగుతుంటే… టీడీపీ కోరిక మేరకు అనే సమాధానం వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది. వైసీపీ విమర్శలకు బలం పెరుగుతుందని అంటున్నారు.
అవును… ఏపీలో పోస్టల్ బ్యాలెట్ రచ్చ రోజు రోజుకీ పీక్స్ కి చేరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉదాహరణలు చూపిస్తూ.. ఎన్నికల ప్రధాన అధికారి ఎంపైర్ లా ప్రవర్తించడం లేదని.. కూటమి సభ్యుడిలా మారారన్నట్లుగా వైసీపీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఆ అధికారి అదేస్థాయిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తుండటం వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే… పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకంతోపాటు సీలు ఉండాలి. అలా ఉంటేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందనే నిబంధన ఉంది. దేశవ్యాప్తంగా ఇదే నిబంధన ఉంది. అయితే… ఏపీలో మాత్రం ఈ నిబంధనకు వెసులుబాటు ఇచ్చారు ప్రధాన ఎన్నికల అధికారి. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇందులో భాగంగా… సీల్ లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. అసలు సీల్ లేకుండా.. అటెస్టేషన్ అధికారి సంతకం లేకుండా అది అధికారిక ఓటు ఎలా అవుతుందనేది వైసీపీ ప్రశ్న. ఇదే సమయంలో… టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే వారికి అనుకూలంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నిబంధన సడలింపు వ్యవహారంపై పునరాలోచించాలని ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అయితే ఈ ఫిర్యాదుని ఈసీ పరిగణలోకి తీసుకునేలా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో వైసీపీ నేతలు కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకుంటామని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
కాగా… గెజిటెడ్ అధికారి సీల్, హోదా వివరాలు లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఏపీ సీఈఓ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో… ఈ ఆదేశాలు గతంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ… తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ నేతలంటున్నారు.