జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి… ఇది లేటెస్ట్ ప్రూఫ్!

ఎవరు ఏమి అనుకున్నా జగన్ ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రాలేదని.. ప్రజల నాడిని పసిగట్టడంలో సీఎం అయినప్పటినుంచీ వరుసగా విఫలమవుతూనే ఉన్నారని.. ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత కూడా మనిషిలో ఇంకా మార్పు రాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతనలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలను బలపరిచే మరో కారణం ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చింది.

అవును… ఏపీలో జగన్ ఓటమికి, కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. అయితే జగన్ చెబుతున్నట్లు ఈవీఎంలు, శకుని పాచికలే కాదు… అసలు కారణాలు ఇంకా చాలానే ఉన్నాయంటూ కారణాలు, అందుకు కారకులైన వ్యక్తుల పేర్లను సైతం వైసీపీ నాయకులు నేరుగా చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జగన్ ఆ కోటరీ విషయంలో ఆలోచన మార్చుకొవడం లేదని, ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వడం లేదని అంటున్నారు పరిశీలకులు.

అందుకు తాజాగా ఒక బలమైన ఉదాహరణ తెరపైకి వచ్చింది. వాస్తవానికి జగన్ కు అత్యంత బలమైన ఓటు బ్యాంక్ ఎస్సీ, క్రీస్టియన్, మైనారిటీ, బీసీలో ఓ సెక్షన్ అని అంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం చీలినా పైన చెప్పుకున్న సెక్షన్స్ మాత్రం చీలలేదని చెబుతున్నారు. దాని ఫలితమే 40% ఓట్లని గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా ఎన్నికల ముందు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకునేవారు. .

సరే నాడు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాటకు చేతలకూ ఎంతవరకూ పొంతన ఉంది అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక కూడా ఆయన విధానం మారలేదని అంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ హస్తిన వేదికగా తెరపైకి వచ్చింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..!

ప్రస్తుతం వైసీపీ నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిచారు. అంటే… లోక్ సభలో వైసీపీకి నలుగురు ఎంపీలున్నారన్నమాట. ఇక రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలున్న సంగతి తెలిసిందే. మొత్తం కలిపి పార్లమెంట్ లో వైసీపీకి 15 మంది ఎంపీలున్నారు. ఈ సమయంలో ఆ 15మందికీ కలిపి ఒక పార్లమెంటరీ పార్టీ నేత అనే ఒక పోస్ట్ ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు జగన్.

ఇక లోక్ సభ విషయానికొస్తే అక్కడ విపక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాజ్యసభ విషయానికొస్తే విజయసాయిరెడ్డికి వైసీపీ విపక్ష నేత పోస్ట్ ఇచ్చారు జగన్. దీంతో… వైసీపీ ఓటమికి ఏయే నిర్ణయాలు, శక్తులు కారణం అని స్వయంగా ఆ పార్టీ నేతలే పరోక్షంగా చెబుతున్న నేపథ్యంలో… జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అంటున్న తరుణంలో కూడా జగన్ మరోసారి “కోటరీ”కే పదవులు కట్టబెట్టారు!

ఈ నేపథ్యంలో… మైకందుకోవడం ఆలస్యం నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పే జగన్… ఈ కీలక పదవుల విషయంలో ఎందుకు ఆ సామాజికవర్గాల వారిని ఎంపిక చేయలేదు అనే చర్చ నడుస్తోంది. ముందుగా లోక్ సభ విషయానికొస్తే… 2021 ఉప ఎన్నికతో పాటు కూటమి వేవ్ నడిచిన తాజాగా ఎన్నికలోనూ కలిపి వరుసగా రెండు సార్లు గెలిచిన ఎంపీ గురుమూర్తి ని వైసీపీ విపక్ష నేతగా జగన్ ఎందుకు అవకాశం ఇవ్వలేదు.. ఇస్తే ఎంత బాగుండేది!!?

ఇక రాజ్యసభ విషయానికొస్తే… ఇక్కడ వైసీపీకి చెందిన బీసీ ఎంపీలు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరికి సభాపక్ష నేత హోదా ఇచ్చి ఉంటే అది ఆ వర్గాలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చి ఉండేది.!? అదే విధంగా పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా బీసీ నేతను ఎంపిక చేసి ఉంటే… అది రాజకీయంగా వైసీపీకి ఎంత ప్రయోజనకరంగా ఉండేది!? ఈ ఆలోచనలు జగన్ ఇప్పటికీ చేయడం లేదు! ఈ నేపథ్యంలోనే జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని అంటున్నారు పరిశీలకులు! ఇప్పటికైనా మారతారా?