ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సర్కారు రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ళలో ప్రజలకు నేరుగా 95,528 కోట్ల రూపాయల్ని అందించినట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్, ఇతర పథకాల ద్వారా మరో 36,192 కోట్లు అందించినట్లు వెల్లడించారు. నిజమే, రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అందించగలుగుతోంది. కరోనా నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా ఊరటనిచ్చాయి. ఇది కాదనలేని వాస్తవం. మొత్తంగా లక్షా ముఫ్ఫయ్ వేల కోట్ల రూపాయల సంక్షేమం.. అంటూ జగన్ సర్కార్ ఘనంగా చెప్పుకుంటోంది. అభినందించాల్సిన విషయమే ఇది. అదే సమయంలో ఆక్షేపణ కూడా తప్పనిసరి. ఎందుకంటే, సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వం చేస్తున్న అప్పు రాష్ట్రానికి గుది బండగా మారుతోంది మరి. ప్రజలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి, ఆ ప్రజలే.. ఆ అప్పుల్ని తీర్చాల్సి వుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పెట్రో ధరల పోటు కావొచ్చు, మరో రకమైన ధరల పోటు కావొచ్చు.. కారణమైదైతేనేం, రాష్ట్రంలో ధరలు గడచిన రెండేళ్ళలో అనూహ్యంగా పెరిగాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇది ఇంకాస్త ఆందోళనకరంగా వుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా అప్పులు జరిగాయని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. మరిప్పుడు జరుగుతున్నదేంటి.? సంక్షేమ పథకాల్ని తప్పు పట్టలేం. సంక్షేమంతో సమానంగా అభివృద్ధి మీద ఖర్చు చేయగలిగితే, తద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు రాష్ట్రానికి మేలు చేస్తాయి. సంక్షేమానికి ఊతమిస్తాయి కూడా. సంక్షేమ పథకాల్ని లబ్దిదారులెవరూ వద్దనరు. అవి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనికొస్తాయి. కానీ, అవే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయనుకోవడం తగదు.