పార్టీలకు ప్రచారం అవసరమే. కానీ అవి అతిగా ఉండకూడదు. అవసరం మేర మాత్రమే ఉండాలి. అలా అతిగా ఉంటే ఎలా ఉంటుందో? మరోసారి నిరూపితమైంది. ఇంతకీ సంగతేంటంటే? అనంతపురం జిల్లాలో 1500 పడకలతో భారీ కొవిడ్ ఆసుపత్రి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ ఊపు చూసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి– చంద్రబాబు నాయుడ్ని దెప్పి పొడుస్తూ ఓ సందర్భంలో కరోనా వస్తే చంద్రబాబు అక్కడికి వెళ్లి వైద్యం చేసుకోవచ్చని సెటైరికల్ గా స్పందించారు.
ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరైన రాజీవ్ కృష్ణ అయితే కర్నాటకలోని ఉన్న ఆసుపత్రిని చూసి జగన్ ఇలా నిర్మిస్తున్నారని ఎలివేషన్లు కూడా ఇచ్చారు. తర్వాత వాస్తవాన్ని తెలుసుకుని రాజీవ్ కృష్ణ ఆ తప్పుని సరిదిద్దుకున్నారు. ఇక కొవిడ్ ఆసుపత్రి అసలు సంగతి లోకి వేళ్తే ప్రభుత్వం అనంతపురంలో ఓ గోడౌన్ అద్దెకు తీసుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పటివరకూ అది ఆసుపత్రిగా రూపం మార్చుకోలేదు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనిపై ఓ పత్రిక కథనమే వేసింది. అయినా కదలిక రాలేదు. మరి ఈ దుస్థితి దేనికో! ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయలేదా? ఉన్నతాధికారులు పట్టించుకోలేదా? అన్నది తెలియాల్సి ఉంది.
దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఆసుపత్రిగా సిద్దం చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అనంతరం, కర్నూలు జిల్లాల్లో భారీగా కేసులు నమోదువుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వైద్యానికి నాలుగు లక్షలు గుంజిన ఘటనలకు బయటపడ్డాయి. నెల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రి బిల్లును ఆసుపత్రి పేరిట కాకుండా ఓ నోట్ పేపర్ పై రాసిచ్చింది. ప్రస్తుతం ఆ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇలాంటి వాటిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.