ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధాని అమరావతి భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసిలు అందజేసినట్లు సమాచారం. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా చంద్రబాబుకు 41 సీఆర్పీసీ నోటీలిచ్చారు.
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలి నుంచి ఆరోపిస్తోంది. రాజధాని ప్రకటనకు ముందుగానే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, వారి బంధువులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ విచారణకు ఆదేశించింది.
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. చంద్రబాబుతో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ తన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులో ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే రాజధాని ప్రకటనను ముందుగానే లీక్ చేయడం ద్వారా అక్కడ వేలాది ఎకరాలను ముందుగానే కొనుగోలు చేసిన అప్పటి మంత్రులు, టీడీపీ నేతలు భారీగా లబ్ధిపొందారన్నది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. చంద్రబాబుపై మూడు రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సెక్షన్లు 120బి, 166, 167, 217 కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.