హోటల్ పార్క్ హయత్ 8వ అంతస్తు సాక్షిగా మాజీ సీఎస్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీ నేత కామినేని శ్రీనివాస్ ల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ రహస్య సమావేశంపై సుజనా చౌదరి వివరణ ఇచ్చినా…అదంతా అవాస్తవం అంటూ ఇదంతా రాజకీయంగా జరిగిన భేటి అంటూ సోషల్ మీడియాలో కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. సుజనా చౌదరి వాస్తవాలు దాచిపెట్టి అవాస్తవాలు ప్రజల మీద రుద్దుతున్నారంటూ వైకాపా నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అగ్రహ వ్యక్తం చేసారు. పార్క్ హయత్ లో జరిగిన భేటీ పై సుప్రీంకోర్టుకు తెలియజేస్తామన్నారు.
రాజ్యంగ పదవిలో ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించే వ్యక్తి ప్రయివేట్ హోటల్ లో రాజకీయ నేతలలో మంతనాలు సాగించాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. తాము మొదటి నుంచి చెబుతోన్న విషయాలే ఇప్పుడు తేట తెల్లమవుతున్నాయన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఈ భేటీపై నిప్పులు చెరిగారు. నిమ్మగడ్డ టీడీపీ పార్టీకి పావుగా మారారని ఆరోపించారు. చంద్రబాబు వెనుకుండి రమేష్ కుమార్ తో ప్రభుత్వంపై కుట్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమీషనర్ గా దళితుడని నియమించినందుకు ఓర్వలేకపో తున్నారని దుబ్బబెట్టారు.
ఈ విషయాలన్నింటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అక్కడ అన్నింటికీ సమాధానం చెప్పడానికి నిమ్మగడ్డ, చంద్రబాబు ఇతర నేతలంతా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. తొలి దఫా తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగానే వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై జగన్ సర్కార్ కే చురకలంటించింది. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రాజకీయ నేతలతో మంతనాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.