ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాలని అత్యున్నత న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయ స్థానం నాలుగు వారల్లో రంగులు మొత్తం తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఆ రంగులను నాలుగు వారల్లో తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ని కొట్టివేసింది. అలాగే హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఒకసారి జీవో కొట్టేసిన తర్వాత మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకిచ్చారని సర్కార్ ని ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన 623 జీవోని రద్దు చేసింది. దీంతో ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కింద కోర్టు హైకోర్టులో రాష్ర్టంలో చోటు చేసుకున్న పలు అంశాలపై ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకున్న సంగతి తెలిసిందే. వాటిలో పలు అంశాలపై సుంప్రీకు వెళ్లేందుకు సమాయత్తం అవుతోంది. తాజాగా రంగుల విషయంలో సుప్రీం తీర్పుతో మరోసారి భంగపడాల్సి వచ్చింది. ఇక మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో అపిల్ వేసిన సంగతి తెలిసిందే.
ముందుగా ఈ కేసు విచారణకు వస్తుందని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ అంతకు ముందే రంగుల పంచాయతీ పై వాదనలు జరిగాయి. నిమ్మగడ్డ విషయంలో తీర్పు ఎలా ఉంటుందని ఇప్పటికే రాష్ర్ట ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తీర్పుతో ప్రతిపక్షాలు సంబురాల్లో మునిగాయి. ప్రభుత్వాలు తప్పు చేసినా…ప్రతిపక్షాలు రాజకీయాలు చేసినా కోర్టుల్లో న్యాయం అనేది ఒకటి జరుగుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతోనైనా జగన్ సర్కార్ జాగ్రత్త పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.