ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే వెంకటేశ్వరరావుని విధుల్లోకి తీసుకోవాలి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులా అనిపించింది. వరుసగా హైకోర్టులో తగులుతోన్న దెబ్బలకు షాక్ అవుతోన్న ప్రభుత్వానికి ఈ తీర్పు భంగకరంగా అనిపించింది. అయితే హైకోర్టు తీర్పునిచ్చినా వెంకటేశ్వరరావు కి ఇంకా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని సమాచారం. అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో సవాల్ కి సిద్దమవుతోందని ప్రభుత్వ వర్గాలు నుంచి తెలిసింది.
దీనిలో భాగంగా సీఎం సంబంధింత అధికారులతో చర్చించనున్నారుట. రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై సుంప్రీలో పిటిషన్ వేసేలా ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతోంది. ఈ కేసుతో పాటు హైకోర్టులో చుక్కెదురైన కేసులపై కూడా ప్రభుత్వం సుప్రీంకు వెళ్లేయోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే సుప్రీంకు వెళ్లే ముందు హైకోర్టు వాదనలపై ఓసారి సీఎం అధికారులతో సమీక్షించనున్నారుట. కేసుకు సంబంధించి పూర్వా పరాలను నిశితంగా పరిశీలించి అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేయాలని ఆలోచన చేస్తున్నారుట.
అలాగే ఏపీ తరుపున వాధించిన న్యాయవాదులు విషయంలో కూడా జగన్ సర్కార్ కీలక మార్పులు దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వరుసగా హైకోర్టులో ఎదురవుతోన్న భంగపాటుకు కారణం న్యాయవాదులా? లేక సరైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతున్నామా? వంటి అంశాల్లో రెండు, మూడు రోజుల్లో జగన్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. వీటన్నింటిపై చర్చించననంతరం జగన్ అండ్ టీమ్ ఓ నిర్ణయానికి రాగానే సుప్రీంలో పిల్ వేసే అవకాశం ఉంది. అయితే హైకోర్టు తీర్పు సుప్రీంలో కీలకంగా ఉంటుంది. హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకునే సుప్రీంలో కేసు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాల్సి ఉంటుంది.