తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరమయ్యారు. ‘నేను ప్రచారానికి వస్తే, వేలాదిమంది గుమికూడతారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. అందుకే, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాను..’ అంటూ, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి ప్రజలకు విన్నవించుకున్నారు. మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన చుట్టూ వున్న వ్యక్తిగత, భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డంతో ‘సెల్ఫ్ క్వారంటైన్’లోకి వెళ్ళిపోయారు. అలా ఆయన కూడా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కీలకమైన దశలో వెళ్ళలేకపోతున్నారు. అయితే, ఆయన కొద్ది రోజుల క్రితమే తిరుపతిలో పర్యటించి, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేసిన సంగతి తెలిసిందే. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, ఎన్నికల ప్రచారంలో ఎక్కడా రాజీ పడ్డంలేదు.
కరోనా సంగతెలా వున్నా, భారీ స్థాయిలో జనసమీకరణ చేపడుతున్నారు టీడీపీ నేతలు, తమ అధినేత పర్యటనల కోసం. అదే సమయంలో, కొందరు టీడీపీ నేతలు కరోనా బారిన పడుతున్న వైనం గురించి కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవసరమా ఇదంతా.? అన్న చర్చ ఓ పక్క జరుగుతోంటే, ‘దటీజ్ చంద్రబాబు.. కరోనా భయాలకు వెరవక ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారం అద్భుతః’ అంటున్నాయి టీడీపీ శ్రేణులు. గతంలో కరోనా మొదటి వేవ్ సందర్భంగా హైదరాబాద్ విడిచి, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు. సరే, ఇంత కష్టపడుతున్నా చంద్రబాబుకి ఫలితం దక్కతుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా, తిరుపతి ఉప ఎన్నికలో అధికార పార్టీని ఢీ కొట్టడం చంద్రబాబుకి అంత తేలిక కాదు.