ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ముగిసినప్పటికీ.. తిరుమల డిక్లరేషన్ వివాదం మాత్రం ఇంకా సమసిపోలేదు. ఇంకా ఏపీలో డిక్లరేషన్ పై చర్చ నడుస్తూనే ఉన్నది. ముందేమో.. అసలు జగన్ డిక్లరేషన్ ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ నడిసింది. ఇప్పుడేమో.. జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? అనే చర్చ నడుస్తోంది.
అయితే.. తిరుమల డిక్లరేషన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే ఆలయంలో ప్రవేశించాలనే నిబంధన ఉంది. అయితే.. దాన్ని పాటించేవాళ్లు చాలా తక్కువ. అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఏపీజే అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చే ఆలయంలో అడుగుపెట్టారని.. ఇప్పుడు జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని.. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడు ఏమీ కాదని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
అయితే.. సీఎం జగన్.. ముఖ్యమంత్రి స్థాయిలో చాలాసార్లు తిరుమలకు వెళ్లారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కూడా తిరుమలకు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా చాలాసార్లు వెళ్లారు. అప్పుడెప్పుడూ ఈ డిక్లరేషన్ గురించి చర్చకు రానప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది.
ఇప్పటికే ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటంతో.. రాజకీయాలు కాస్త మతం రంగును పులుముకున్నాయి. ఈనేపథ్యంలోనే టీడీపీ, బీజేపీ పార్టీలు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఏపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. హిందూ వ్యతిరేక ప్రభుత్వమంటూ ఆందోళనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో.. జగన్ తిరుమల పర్యటన ఖరారు కావడంతో… డిక్లరేషన్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాయి.
అయితే.. టీడీపీ, బీజేపీ నేతలంతా.. డిక్లరేషన్ ఇచ్చే తిరుమల ఆలయంలో జగన్ అడుగుపెట్టాలని డిమాండ్ చేసినప్పటికీ.. జగన్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. వాళ్లు అరిచి గీపెట్టుకున్నా.. జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోయారు. తన మౌనంతోనే వాళ్లకు సమాధానం చెప్పారు. తిరుమలకు వెళ్లగానే ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి వెళ్లారు. పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. అక్కడ జగన్ ను డిక్లరేషన్ సమర్పించాలని అడిగిన నాథుడే లేడు.