Jagan Dares : మూడు రాజధానుల విషయమై హైకోర్టు ఏం చెప్పింది.? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? అన్నది ప్రజలందరి ముందూ వున్న విషయమే. ‘మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకుంటున్నాం..’ అని స్వయంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
అంతే తప్ప, న్యాయస్థానం మూడు రాజధానుల చట్టాన్ని కొట్టి పారేయలేదు. మరి, న్యాయ వ్యవస్థపై అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు చర్చకుపక్రమించినట్లు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
కాంగ్రెస్ ఎంపీగా వున్నప్పుడే, ఆ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి, జనంలోకి వెళ్ళి తనదైన రాజకీయ వ్యూహాలతో ఓటర్లను గెలుచుకున్నారు.. 2014 ఎన్నికల్లో సాధించలేకపోయినా, 2019 ఎన్నికల్లో అధికార పీఠమెక్కారు.
సరే, జనం ఓట్లేసి గెలిచినంతమాత్రాన సర్వాధికారాలూ తమకే వుంటాయని ఏ అధికార పార్టీ కూడా భావించకూడదు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని కొనసాగించాలి.. కొత్తగా తమదైన ఆలోచనలకు చట్ట రూపం ఇవ్వడమూ తప్పులేదు.
కానీ, ఇక్కడ వ్యవహారం తేడా కొట్టింది. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్న వైఎస్ జగన్ సర్కారు, ఆ నిర్ణయం విషయంలో ముందుకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో నానా తంటాలూ పడుతోంది.
న్యాయ వ్యవస్థ ముందు తమ నిర్ణయం వీగిపోతుందని తెలిసి, ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్న జగన్ సర్కారు, మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి వున్నామని చెప్పడంలో అసలు అర్థమే లేదు.
శాసన సభలో న్యాయ వ్యవస్థపై చర్చ చేయడం కంటే, మూడు రాజధానులపై బిల్లు పెట్టి పాస్ చేయించేసుకుని.. మూడు రాజధానుల్ని అమలు చేసి వుంటే బావుండేదేమో.!
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. ప్రజల్లో పలచనైపోయేలా వ్యవహరించడం రాజకీయంగా వైసీపీకి అంత మంచిది కాదు.!