Jagan : జగన్ సర్కారుపై అటు క్షీరాభిషేకాలు.. ఇటు తిట్ల పురాణాలు.!

Jagan : అధికార పార్టీకి చెందిన నేతలేమో క్షీరాభిషేకాలతో సందడి చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులేమో తిట్ల పురాణంతో విరుచుకుపడుతున్నారు. ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ స్కీమ్ విషయంలో ఏది వాస్తవం.? అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.

ప్రభుత్వం నుంచి భూమి, గృహాల్ని పొందిన లబ్దిదారులకు రుణ విమోచనం కల్పించేలా, వారికి తమ ఆస్తులపై సంపూర్ణ హక్కు కల్పించేలా ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ స్కీమ్ తెరపైకి తెచ్చినట్లు వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. అయితే, ‘భూమి నువ్వు ఇచ్చావా.? ఇళ్ళు నువ్వు కట్టించి ఇచ్చావా.? నువ్వెందుకు వసూలు చేస్తున్నావ్.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

‘మేం అధికారంలోకి వస్తే, పూర్తి ఉచితంగా సెటిల్మెంట్ చేస్తాం..’ అని చంద్రబాబు చెబుతుండడంతో, లబ్దిదారులు సహజంగానే, వైఎస్ జగన్ సర్కారు తీరుని తప్పు పడతారు. అదే జరుగుతోంది కూడా. ‘కరోనా కష్టాల్లో వున్న మేం, పది వేలో.. పాతిక వేలో ఎలా కట్టగలం.?’ అన్నది బాధితుల ఆవేదన.

మరోపక్క, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే ఆస్తుల విలువ పెరుగుతుందనీ మరికొందరు లబ్దిదారులు భావిస్తున్నారు. అలాంటివాళ్ళంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు స్పెషల్ ఫోకస్ ఇస్తూ, జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకాలు చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సున్నితమైన అంశమిది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయడంలో అధికార వైసీపీ విఫలమవుతోంది. అదే విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతోంది.